తెలంగాణ

telangana

ETV Bharat / bharat

viveka murder case : 5వ రోజు కస్టడీ.. 6 గంటలు విచారణ.. కీలక సమాచారం రాబట్టిన సీబీఐ - ఐదో రోజు కస్టడీ

viveka murder case : వివేకా హత్య కేసులో నిందితులైన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఐదో రోజు కస్టడీ ముగిసింది. సుమారు 6 గంటలకు పైగా విచారించిన అధికారులు... కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. సీబీఐ కస్టడీ రేపటి(ఈ నెల 24)తో ముగియనుండగా.. విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను సీబీఐ సిట్ కోర్టుకు సమర్పించనుంది. మరోవైపు ప్రత్యేక బృందం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఆరా తీసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 23, 2023, 7:59 PM IST

Updated : Apr 24, 2023, 8:03 AM IST

Viveka murder case:మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్ ఐదో రోజు కస్టడీ ముగిసింది. సుమారు ఆరు గంటలకు పైగా విచారించిన సీబీఐ అధికారులు... విచారణను వీడియో రికార్డు చేశారు. ఆరు రోజుల పాటు భాస్కర్‌ రెడ్డిని, ఉదయ్‌ కుమార్​ను కోర్టు కస్టడీకి అనుమతించగా.. ఈ నెల 24తో ముగియనుంది. సోమవారం విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట సీబీఐ ఆధికారులు హాజరుపరచనున్నారు.

కీలక సమాచారం..ఐదో రోజు కస్టడీలో భాగంగా ఉదయ్‌ కుమార్ నుంచి కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు రాబట్టినట్లు సమాచారం. వివేకా హత్య అనంతరం సమాచారం తెలుసుకుని ఆయన ఇంటికి వచ్చి సాక్ష్యాలను తారుమారు చేసిన వ్యవహారం భాస్కర్‌ రెడ్డి సమక్షంలో జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఇందుకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించాడని ఇప్పటికే సీబీఐ పేర్కొంది. నిన్న సీబీఐ విచారణకు హాజరైన సునీత భర్త, వివేకా అల్లుడు రాజశేఖర్​ ఇచ్చిన సమాచారం అనుగుణంగా ఓ బృందం పులివెందుల వెళ్లగా.. సీబీఐ కార్యాలయంలో మరో బృందం భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్​ను విచారించింది. వివేకా ఇంట్లో నిందితులు భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ ఎంత సేపు ఉన్నారనే సమాచారాన్ని ఇప్పటికే గూగూల్ టేక్‌ అవుట్‌ ద్వారా నిర్ధారించగా.. అదే అంశంపై వాటిని ముందుంచి ఇద్దరినీ విచారించారు. భాస్కర్ రెడ్డికి వెన్ను నొప్పి దృష్ట్యా ఆయన కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆరు రోజుల కస్టడీ.. సంబంధించిన విచారణను సీబీఐ అధికారులు కోర్టులో సమర్పించనున్నారు.

పులివెందులలో సీబీ'ఐ'..పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటిని సీబీఐ బృందం ఆదివారం పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ అధికారులు ఇంటి పరిసరాలను, ఇంట్లో హత్య జరిగిన బాత్రూం, బెడ్ రూమ్ పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుంచి సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి ఎంత సమయంలో వచ్చాడన్న విషయమై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు.. ఆ మేరకు తనిఖీకి వచ్చారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ప్రశ్నించిన సిట్ అధికారులు.. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. సోమవారం (ఈ నెల 24వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా వివేకా, అవినాష్ రెడ్డి ఇంటిని పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

క్షేత్రస్థాయిలో సమాచారం ఆరా..హత్య జరిగిన రోజు తాను జమ్మలమడుగు వెళ్తుండగా.. ఫోన్ ద్వారా సమాచారం తెలిసి తిరిగివచ్చానని గతంలో అవినాష్ సీబీఐకి వెల్లడించారు. కాగా, అవినాష్ చెప్పిన సమాచారాన్ని ధ్రువీకరించుకునేందుకు సీబీఐ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవినాష్ పీఏను పులివెందుల రింగ్‌రోడ్ వద్దకు తీసుకువెళ్లి.. ఎంత సమయంలో వివేకా ఇంటికి తిరిగి వచ్చారనే దానిపై సీబీఐ ఆరా తీసింది. పులివెందుల రింగ్‌రోడ్‌ వద్ద 30 నిమిషాల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 24, 2023, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details