దేశ న్యాయవ్యవస్థలో లోపం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపే మరో ఘటన గుజరాత్లో జరిగింది. కన్న కూతురు చేసిన అత్యాచార ఆరోపణలపై జైలు జీవితం అనుభవించిన ఓ వ్యక్తిని.. రెండేళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. అతడు దోషి అని నిరూపించేలా పోలీసులు తగిన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయారు. కోర్టు నుంచి విడుదలయ్యాక సమాజంలో తాను కోల్పోయిన మర్యాద, గౌరవం తిరిగి వస్తాయా అంటూ అతడు విలపించాడు.
ఇదీ జరిగింది..ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బలరామ్ విశ్వంభర్.. వారణాసిలో చదవుకున్నాడు. అనంతరం 2003లో గుజరాత్.. వల్సాద్ జిల్లాలోని పార్డిలో హిందీ-సంస్కృత ఉపాధ్యాయునిగా చేరాడు. 2020 జులై 8న అతడి కుమారై 1098కి కాల్ చేసి తనపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపించింది. 1098 హెల్ప్‌లైన్ వల్సాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సోనాల్ సోలంకితో పాటు అతడి బృందం బలరామ్ ఇంటికి చేరుకుంది. అతడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదును విచారించకుండానే.. పార్డి పోలీస్ స్టేషన్‌లో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బలరామ్ కుమార్తెను ధరసనా చిల్డ్రన్స్ హోంకు పంపించారు.
వెంటనే బలరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిజనిజాలు తెలుసుకోకుండానే దారుణంగా ప్రవర్తించారు. లాఠీ దెబ్బలు కూడా కొట్టారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అక్కడ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన బలరామ్.. చివరకు నిర్దోషిగా విడుదలయ్యాడు. నిర్దోషిగా తేలిన తరువాత.. బలరామ్ కోర్టు ప్రాంగణంలో పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. తన పరువు మొత్తం తీశారని వాపోయాడు.