భారత స్వాతంత్ర్య సమరం మానవాళి చరిత్రలోనే మహోన్నత ఘట్టం. ఆ సమర ఫలమే స్వతంత్ర భారత ఆవిర్భావం. కానీ, భారతదేశం సమైక్యంగా విరాజిల్లడం కుత్సిత వలస పాలకులకు ఏమాత్రం సమ్మతం కాదు కనుకనే పోతూపోతూ దేశాన్ని అడ్డదిడ్డంగా విభజించి పోయారు. అంతకుముందు నుంచి బ్రిటిష్ వారు హిందూ, ముస్లింల మధ్య పెంచిపోషించిన వైషమ్యాలు విభజన సమయంలో ఒక్క పెట్టున ప్రజ్వరిల్లి దారుణ మారణహోమానికి దారితీశాయి.
1857 నాటి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా తమపై పోరాడటం చూసి బ్రిటిష్ వారు హడలుకున్నారు. భారతీయులు కుల, మత భేదాలు లేకుండా ఒక్కటైతే తమ పాలనకు గోరీ కట్టేస్తారని వారికి అర్థమైపోయింది. అందుకే వారి మనసుల్లో అనైక్యతా విష బీజాలను నాటారు.
- స్వాతంత్య్రానికి ముందు నుంచే ముస్లింలీగ్‌ను బలోపేతం చేసి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసే స్థాయికి దాన్ని పెంచారు. తద్వారా దేశ విభజనను అనివార్యం చేశారు. నిజానికి ముందాలోచనతో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే, దేశ విభజన అంత రక్తసిక్తంగా మారేది కాదు.
- విభజన రక్తపాతానికి దారితీస్తుందనడానికి ముందే సంకేతాలు వచ్చాయి. స్వాతంత్ర్యానికి ముందే.. 1946 ఆగస్టు 16న కోల్‌కతాలో మూడు రోజులపాటు రేగిన హింసాకాండలో 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షమంది నిరాశ్రయులయ్యారు. దీన్ని గుర్తుంచుకునైనా 1947 దేశ విభజన సందర్భంలో జాగ్రత్తపడి ఉండాల్సింది.