తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ - modi in bengal

తాము అధికారంలోకి వస్తే బంగారు ​బంగాల్​ను నిర్మిస్తామని ప్రధాని మోదీ హామీనిచ్చారు. బంగాల్‌ను అభివృద్ధి చేస్తారంటూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మమతా బెనర్జీ వమ్ము చేశారని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారి బంగాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. తొలి సభలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మమతా, ఆమె మద్దతుదారులు బంగాల్‌ను అవమానించారంటూ ఆరోపించారు.

The dream of 'sonar bangla' will be fulfilled says modi
'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ

By

Published : Mar 7, 2021, 3:02 PM IST

Updated : Mar 7, 2021, 4:28 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించారు. కోల్‌కతాలో చారిత్రక బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ​బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. బంగాల్‌ ప్రజలు కోరుకున్న మార్పును తేవడంలో మమత విఫలమయ్యారని ప్రధాని ఆరోపించారు. బంగాల్‌లో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని, ప్రజలను మతపరంగా మమత విభజించారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే 24 గంటలూ పనిచేసి బంగాల్‌ను అభివృద్ధి చేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. భారతమాత ఆశీర్వాదంతో బంగారు బంగాల్‌ను నిర్మిస్తామని హామీనిచ్చారు.

బంగాల్​లో మోదీ

"బంగాల్ ప్రజలు మార్పు జరుగుతుందని మమతా దీదీపై భరోసా ఉంచారు. కానీ మమతా, ఆమె మద్దతుదారులు మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. మీ కలలను ముక్కలు ముక్కలు చేశారు. వీళ్లందరూ బంగాల్‌ను అవమానించారు. బంగాల్‌కు అభివృద్ధి కావాలి. శాంతి కావాలి. ప్రగతిశీల బంగాల్‌ కావాలి. బంగారు బంగాల్‌ కావాలి. భారతమాత ఆశీస్సులతో సోనార్‌ బంగాల్‌ లక్ష్యం త్వరలోనే సాకారమవుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తన స్నేహితులన్న మోదీ.. వారి సంక్షేమం కోసం నిత్యం పని చేస్తానని హామీనిచ్చారు. బంగాల్‌ను అభివృద్ధి చేయలేక మమత తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బంగాల్‌ వ్యతిరేక శక్తులు ఒకవైపు.. బంగాల్‌ అభివృద్ధి మరోవైపు పోరులో నిలిచాయని వెల్లడించారు.

ప్రసంగిస్తున్న ప్రధాని

"ఈసారి శాసనసభ ఎన్నికల్లో బంగాల్‌ వ్యతిరేకులైన టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ ఒకవైపు ఉన్నాయి. మరోవైపు బంగాల్‌ ప్రజలు ఉన్నారు. బంగాల్‌ అభివృద్ధి గురించి.. ఇక్కడ పెట్టుబడులను వృద్ధి చేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మకం కలిగించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. బంగాల్‌ను పునర్నిర్మిస్తామని, బంగాల్‌ సంస్కృతి, ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తానని భరోసా ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చాను. అసమర్థత వల్ల, భయం వల్ల మమతా దీదీకి ఆగ్రహం వస్తుంది. ఈ కోపంలో నన్ను ఏమేమీ అన్నారో మీ అందరికీ గుర్తుందా. నన్ను రావణుడు అని, రాక్షసుడు అని, కొన్నిసార్లు గుండా అని మమత తిట్టారు. మమత అసలు మీకు అంత కోపం ఎందుకు?"

-నరేంద్ర మోదీ, ప్రధాని

మోదీ సభలో జనసందోహం

ప్రధాని మోదీ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సుమారు ఏడు లక్షల మంది మద్దతుదారులు సభకు వచ్చినట్లు భాజపా తెలిపింది. ప్రధాని రాకతో బ్రిగేడ్ పరేడ్ మైదానం చుట్టూ భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి: అసోం:కాంగ్రెస్ అభ్యర్థుల్లో సగం మంది కొత్తవారే

Last Updated : Mar 7, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details