తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మరణంలోనూ.. నేనున్నానని.. నీతో వస్తానని'.. భద్రాద్రి దంపతుల హార్ట్ ​టచింగ్ స్టోరీ - Death of Shyampuri Bhaskar Rao couple

Bhadradri Couple Heart Touching Story: వాళ్లిద్దరూ ఒకరినొదిలి ఒకరు ఏనాడు ఉండలేదు. నాలుగు దశాబ్దాల క్రితమే.. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్యోన్యదంపతులుగా కలకాలం జీవించారు. కానీ విధి వారిని విడదీసింది. గుండెపోటుతో భర్త మరణించగా.. భర్త ఎడబాటును తట్టుకోలేని భార్య 24 గంటల వ్యవధిలోనే మానసిక క్షోభతో మరణించింది. ఈ హృదయవిదారకమైన ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

couple
couple

By

Published : Apr 17, 2023, 12:57 PM IST

Bhadradri Couple Heart Touching Story: మనుషులు వేరు మనసు ఒకటే.. బంధువులు వేరైనా కానీ బాంధవ్యం ఒక్కటే.. పరిస్థితులు వేరైనా ప్రతిస్పందన ఒకటే.. ముఖం చూసినంతనే మనసులోని ఒకరి ఆలోచనల్ని ఇంకొకరు అర్థం చేసుకోవటం.. మాటలో కరకుదనం పరిస్థితుల ప్రభావం అని అన్వయించుకోవటం, అర్ధాంతర మౌనం ఒత్తిడి ప్రభావమని భావించటం, జీవించటం.. మొదలగునవి ఆదర్శ దంపతుల లక్షణాలు. ఇరువురు ఏకమై.. మూడు ముళ్ల బంధం మొదలవగానే పిల్లలు, కుటుంబాన్ని బంధంగా ఒకరు, బాధ్యతగా ఇంకొకరు జీవితాంతం వారు భావిస్తుంటారు.

Bhadradri Couple Died on The Same Day : అన్ని విషయాల్లో ఈ ‘ఏకతా సూత్రం’ అన్యొన్యత దూరం కావటమే నేటి కాలంలో భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతోంది. క్షణికావేశం, ‘నేను’ అనే చట్రంలో ఇరుక్కపోవటం, ఎదుటి వ్యక్తి బాధల్ని, భావావేశాల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోకపోవటం ఇలాంటివన్నీ ఇళ్లలో విభేదాలు రగులుస్తున్నాయి.. తరచూ వెలుగుచూస్తున్న ఇలాంటి వార్తలకు భిన్నంగా పాల్వంచ మండలంలో ఒకరినొకరు వదలి ఉండలేక దంపతులిద్దరూ 24 గంటల వ్యవధిలో కన్నుమూసిన ఘటన వెలుగు చూసింది.

భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగుకు చెందిన శ్యాంపురి భాస్కర్‌రావు(70), బాయమ్మ(60)లు నాలుగు దశాబ్దాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరైనా వారిద్దరూ పెద్దవారిని ఎదిరించి ఒకటయ్యారు. ఆ బంధాన్ని ఆసాంతం సాగించారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండే వారు కాదు. ఎక్కడికెళ్లాలన్నా కలిసే వెళ్లేవారు. వారికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మనవరాళ్లూ, మనవళ్లు ఉన్నారు. కేటీపీఎస్‌లో పనిచేసిన భాస్కర్‌రావు ఉద్యోగ విరమణ అనంతరం పట్టణంలోని నవభారత్‌లో ఇల్లు కట్టుకున్నారు.

కుటుంబ బాధ్యతలు తీర్చుకున్న వృద్ధ దంపతులిద్దరూ చీకు చింతా లేకుండా ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. వారి బంధాన్ని చూడలేని విధికి కన్నుకుట్టిందో ఏమో.. గుండెపోటు రూపాన భార్యాభర్తలిద్దరూ మృత్యుఒడికి చేరారు. శుక్రవారం సాయంత్రం భాస్కర్‌రావుకు పక్షవాతం లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత అదేరోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మళ్లీ భాస్కర్​రావుకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు. చనిపోయే ముందు భార్య బాయమ్మను చూడడానికి ఆరాటపడ్డాడని, కుటుంబ సభ్యులు తెలిపారు.

మానసికంగా కుంగి..

భర్త వియోగాన్ని తట్టుకోలేని బాయమ్మ రోజంతా విలపించింది. తీవ్రంగా కుంగిపోయింది. మానసిక క్షోభతో శనివారం అర్ధరాత్రి 1.30 గంటల గుండెపోటుతో మృతి చెందింది. 24గంటల వ్యవధిలోనే వారు మరణించడం చుట్టుపక్కల వారందరిని కలచివేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details