elevation of the Polavaram project : పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా విభిన్న ప్రకటనలు చేసింది. 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లుగా ప్రకటించింది. నీటినిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకి తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తమ వద్ద సమాచారం లేదని చెప్పింది. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్.. సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఇటీవల వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ.. పోలవరం మొదటి దశలో భాగంగా ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేశారు. కాగా, అందుకు భిన్నంగా తాజాగా కేంద్రం మరో ప్రకటన చేయడం గమనార్హం.
ప్రాజెక్టు అంచనాలపై... ఇక.. పోలవరం సవరించిన అంచనాలపైనా రాజ్యసభలో కేంద్రం సమాధానం ప్రకటించింది. సవరించిన అంచనాలపై ఒకే కమిటీ రెండు సిఫారసులు చేసినట్లు వెల్లడించింది. సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా? అని ఎంపీ కనకమేడల కేంద్రాన్ని పశ్నించగా.. పోలవరం ప్రాజెక్టు పురోగతి నివేదికను కేంద్రం సభముందు ఉంచింది. 2017-18 ధరల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా ఉందన్న కేంద్రం.. 2019లో తమకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం రూ.55,548కోట్లుగా వెల్లడించింది. వచ్చిన అంచనాలను జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని, ఆర్‌సీసీ అధ్యయనంలో అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. 2013-14 ప్రకారం అంచనా వ్యయం రూ.29,027 కోట్లు అని తెలిపిన కేంద్రం.. భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చు వల్లే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని పేర్కొంది. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇప్పటివరకు రూ.13,463కోట్లు ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసింది.