తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ హయాంలో సుపరిపాలన.. 8 ఏళ్ల ప్రస్థానంపై పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రం - కేంద్రంలో భాజపా సర్కారుకు 8 ఏళ్ల

నరేంద్ర మోదీ సర్కారు 8 ఏళ్ల పాలనపై కేంద్రం పుస్తకాన్ని విడుదల చేసింది. మోదీ ప్రధాని పీఠమెక్కాక చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అందులో వివరించింది. ‘8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం’ అనే పేరుతో రూపొందించిన ఈ పుస్తకంలో.. వివిధ అంశాల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను వివరించింది.

మోదీ హయాంలో సుపరిపాలన.. 8 ఏళ్ల ప్రస్థానంపై పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రం
మోదీ హయాంలో సుపరిపాలన.. 8 ఏళ్ల ప్రస్థానంపై పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రం

By

Published : Jun 1, 2022, 5:50 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఎనిమిదేళ్లలో దేశానికి సుపరిపాలన అందించారని కేంద్రప్రభుత్వం పేర్కొంది. సేవ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపింది. మోదీ ప్రధాని పీఠమెక్కాక చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కేంద్రం వంద పేజీల కరపుస్తకాన్ని మంగళవారం విడుదల చేసింది. ‘8 ఏళ్లలో సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం’ అనే పేరుతో రూపొందించిన ఈ పుస్తకంలో.. వివిధ అంశాల్లో గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాను వివరించింది. ‘‘సులభతర జీవనం ప్రతి పౌరుడి హక్కు. అందుకే దానికి మా ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. దేశ ఆర్థిక పరిస్థితులను మార్చడానికి, ప్రజల జీవన ప్రమాణాల నాణ్యతను పెంచి వారి సామాజిక జీవితాన్ని మెరుగుపరచడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ ఈ ప్రభుత్వం వదులుకోదు’’ అంటూ పుస్తకానికి ప్రధాని ముందుమాట రాశారు. సులభతర జీవనం, వైద్యం-ఆరోగ్యం, మౌలికవసతుల కల్పన సహా మొత్తం 14 విభాగాల్లో మోదీ సర్కారు సాధించిన విజయాలను ఇందులో ప్రస్తావించారు. గత ప్రభుత్వానికి, తమ సర్కారుకు మధ్య తేడాను చాటిచెప్పే ప్రయత్నం చేశారు.

కరపుస్తకంలో పేర్కొన్న కీలకాంశాలివీ..

* స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కారణంగా 4,371 నగరాలు బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందాయి. 66.9 లక్షల వ్యక్తిగత, 6.42 లక్షల సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.

* గ్రామీణ ప్రాంతాల్లో 11 కోట్లకుపైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది.

* అమృత్‌ పథకం కింద 12.7 కోట్ల కొత్త కొళాయి కనెక్షన్లు, 95 లక్షల కొత్త మురుగునీటి పారుదల కనెక్షన్లు అందించాం.

* రోజుకు 236 కోట్ల లీటర్ల మురుగునీటి శుద్ధి సామర్థ్యమున్న ప్లాంట్లు స్థాపించాం.

* 2017 సెప్టెంబర్‌ 25న పీఎం సౌభాగ్య పథకం ప్రవేశపెట్టేనాటికి దేశంలో 89% ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 99.99 శాతానికి పెంచాం.

* పీఎం-కిసాన్‌ పథకం కింద 11.78 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు రూ.1.2 లక్షల కోట్లు పంపిణీ చేశాం. అందులో 80% మంది చిన్న, సన్నకారు రైతులే.

* భూసార పరీక్షలతో 23 కోట్ల మంది రైతులకు కార్డులు పంపిణీ చేశాం.

* రూ.3.4 లక్షల కోట్ల క్రెడిట్‌తో 3 కోట్ల కొత్త కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేశాం.

* కృషి సించాయి యోజన కింద 2015-16 నుంచి 63.96 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. రూ.5 వేల కోట్లతో సూక్ష్మసేద్య నిధిని ఏర్పాటుచేశాం.

* స్వామిత్వ పథకం ద్వారా 29 వేల గ్రామాల్లో 36 లక్షల మందికి ఆస్తి కార్డుల పంపిణీ జరిగింది. 1.35 లక్షల గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తయింది.

* ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వైద్య బీమా కల్పించాం. 3.28 కోట్ల మందికి ఉచిత వైద్యసేవలు అందించాం.

* మిషన్‌ ఇంద్రధనుష్‌ కింద 4.31 కోట్లమంది పిల్లలు, 1.08 కోట్లమంది గర్భిణులకు టీకాలను పంపిణీ చేశాం.

* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్‌ కల్పించాం. ఓబీసీ జాబితా తయారుచేసుకొనే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించాం. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం అందించే వ్యవస్థను బలోపేతం చేశాం.

* ముమ్మారు తలాక్‌ను రద్దు చేశాం.

* 34 ఏళ్లనాటి విద్యావిధానాన్ని మార్చి నూతన జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేశాం.

* అయోధ్య ఆలయం, కాశీ విశ్వనాథ్‌ కారిడార్, కేదార్‌నాథ్‌ ధామ్‌ ఆలయాలను అభివృద్ధి చేశాం.

మోదీ సర్కారు ఇంకా ఏం చేసిందంటే..

* పీఎం స్వనిధి కింద 31.9 లక్షలమంది వీధి వ్యాపారులకు రుణాల మంజూరు.

* గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద 80 కోట్ల పేద కుటుంబాలకు 1,000 లక్షల మెట్రిక్‌టన్నుల ఆహారధాన్యాలు ఉచితంగా సరఫరా.

* మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణ. ట్రాన్స్‌జెండర్‌ హక్కులకు చట్టబద్ధమైన రక్షణ.

* 384 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్వహణ. 3,110 వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల ఏర్పాటు.

* 45 కోట్లమంది జన్‌ధన్‌ ఖాతాదారులకు వివిధ పథకాల రూ.22 లక్షల కోట్ల నగదు బదిలీ. తద్వారా రూ.2.22 లక్షల కోట్ల ఆదా.

* జన్‌ధన్‌ యోజన కింద 2015లో సగటున ఒక్కో ఖాతాలో రూ.1,065 డిపాజిట్‌ కాగా, ఇప్పుడు అది రూ.3,694కి చేరిక. మొత్తం రూ.1.66 లక్షల కోట్ల జమ.

* ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 2.47 కోట్ల మంది గర్భిణులు, బాలింతలకు రూ.10,793 కోట్ల బదిలీ.

* 1.34 కోట్లమంది యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ. 50 లక్షలమంది నైపుణ్యాలకు మెరుగు.

* 3.99 కోట్ల నకిలీ, డూప్లికేట్‌ రేషన్‌ కార్డుల రద్దు. 4.11 కోట్ల నకిలీ, డూప్లికేట్‌ గ్యాస్‌ కనెక్షన్లకు మంగళం.

* ఈ-నామ్‌ కింద 1,000 మండీల అనుసంధానం. 1.72 కోట్ల మంది రైతుల నమోదు.

* చౌకధరల్లో విమానయాన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి 2016లో ప్రవేశపెట్టిన ఉడాన్‌ పథకం ద్వారా రూ.2,500 టికెట్‌తో 87 లక్షలమంది ప్రయాణం.

* భారత్‌ నెట్‌ కింద 2022 మార్చి నాటికి 1.77 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్‌ సౌకర్యం.

* 93% గ్రామాల్లోని భూరికార్డుల కంప్యూటరీకరణ. 1,11,47,387 మ్యాప్స్‌ డిజిటలీకరణ.

ఇదీ చూడండి..

'జిల్లాకో మెడికల్​ కాలేజీ మా లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details