CBI investigation in Viveka's murder case: వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్తున్న అవినాష్ రెడ్డికి మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. మరోవైపు పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు.. అవినాష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన వాహన డ్రైవర్ నాగరాజుకు నోటీసులు అందజేశారు.
సీబీఐకి లేఖ రాసిన అవినాష్ రెడ్డి.. నోటీసులు ఇవ్వడానికి ముందుగా.. అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల మంగళవారం(ఈ నెల 16) విచారణకు హాజరు కాలేనంటూ లేఖలో పేర్కొన్నారు. మరో నాలుగు రోజులు గడువు కావాలంటూ లేఖలో కోరారు. నోటీసు ఇచ్చి ఒకరోజు వ్యవధిలోనే హాజరు కావాలని సూచించడం వల్ల రాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. 160 సీఆర్పీసీ కింద సోమవారం నోటీసులు జారీ చేసిన అధికారులు.. మంగళవారం ఉదయం 11గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాలని సూచించారు. అవినాష్ రెడ్డి కార్యాలయానికి వస్తారని భావించి సీబీఐ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అవినాష్ రెడ్డి రావడం లేదని సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అవినాష్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని గాయత్రి హిల్స్‌లో తన నివాసం నుంచి బయల్దేరి పులివెందులకు వెళ్లారు.
అనుచరుల విచారణ..పులివెందులకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఆయన సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో వివేకా హత్య జరిగిందని అవినాష్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు. దీంతో సీబీఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు నిర్వహించారు. అందులో భాగంగా సీబీఐ కార్యాలయానికి పలువురిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వివేకా కూమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాతో పాటు మరికొంత మందిని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. దాదాపు 20రోజుల గడుపు తర్వాత సీబీఐ అధికారులు మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తేనే వివేకా హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని, సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.