Gajjala Uday Remand : వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు ఉదయ్‌కుమార్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సీబీఐ అధికారులు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ఇవాళ ఉదయం కడపలో అరెస్టు చేయడం విదితమే.
వేగం పెంచిన అధికారులు.. మాజీ మంత్రి.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యాన సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అంతకు ముందు.. సీఆర్‌పీసీ 161 కింద నోటీసులు ఇచ్చి ఉదయ్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. ఉదయ్ కుమార్‌ను ఆయన తండ్రి జయప్రకాశ్‌రెడ్డి, అతడి న్యాయవాది సమక్షంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు మెమో అతడి కుటుంబ సభ్యులకు అప్పగించిన సీబీఐ.. ఉదయ్‌కుమార్‌రెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకుంది. అనంతరం కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు.
సోమవారం విచారణ... ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు... న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణకు హాజరైన తర్వాత కడపలో అరెస్టు చేసిన అనంతరం హైదరాబాద్ లోని విజయ్‌నగర్‌కాలనీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా... 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుడిని కస్టడీకి కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఉదయ్‌కుమార్‌రెడ్డి... అవినాష్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. నెల కిందట వరకు సీబీఐ దర్యాప్తు అధికారిగా పనిచేసిన ఎస్పీ రాంకుమార్ సింగ్ పై ఉదయకుమార్‌రెడ్డి తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో... ఇప్పటికీ అరెస్టయిన నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది.