విభజించు పాలించు సూత్రంతో మనల్ని దాదాపు 200 ఏళ్లు ఏలిన బ్రిటిషర్లు... 1947లో పోతూపోతూ చివరి క్షణాల్లో కూడా తమ విభజన ఆయుధాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించారు! భారత్, పాకిస్థాన్‌ల రూపంలో దేశాన్ని(Partition of India) రెండుగా చీల్చాలని నిర్ణయించాక కూడా వారి మనసు సంతృప్తి చెందలేదు. చివరి రోజుల్లో.. మరో చీలికకు ఎత్తు వేశారు. అదే బంగాల్(Partition of Bengal)! భారత్, పాకిస్థాన్‌లతో పాటు సంయుక్త బంగాల్‌నూ ఓ ప్రత్యేక దేశంగా చేయాలని భావించారు. 1947 జూన్ 2న యూకేలో అమెరికా రాయబారితో సమావేశమైన సందర్భంలో అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ తన మనసులో మాట బయటపెట్టారు. "పంజాబ్ విభజన ఖాయమైపోయింది. కానీ బంగాల్ మాత్రం.. ఈ విభజనలో భాగం కాకుండా అటు పాకిస్థాన్, ఇటు భారత్‌లో చేరకుండా ఉండే అవకాశం కూడా లేకపోలేదు" అని! అంటే... భారత్, పాకిస్థాన్‌లతో పాటు సంయుక్త బంగాల్‌ను మూడో దేశంగా ప్రకటించాలన్నది అట్లీ ప్రతిపాదన!
ఈస్టిండియా కంపెనీ(east India company) నాటి నుంచీ బంగాల్ (పశ్చిమ, తూర్పు ప్రాంతాలు కలిపి)తో బ్రిటిషర్లు బాగా దగ్గరయ్యారు. వారి స్థావరాలు, ఆస్తులు, వాణిజ్యం... అక్కడే ఎక్కువ! భారీ జనాభాతో... అనేక వనరులతో అలరారుతున్న బంగాల్‌పై పట్టు కోల్పోకుండా ఉండటానికి ఈ ఎత్తు వేశారు. అట్లీ తన మనసులో మాట చెప్పటానికి కొద్దినెలల ముందే... 1947, ఏప్రిల్ 27న బంగాల్ ప్రధాని సుహ్రవార్డీ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... బంగాల్ ప్రత్యేక దేశ ప్రస్తావన తెచ్చారు. "బంగాల్ స్వతంత్రంగా అద్భుతమైన దేశంగా నిలబడుతుంది. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమ... సంస్కృతి ఏ రంగంలో తీసుకున్నా ఇది ప్రపంచంలో చాలా ప్రగతిశీల దేశమవుతుంది. బంగాల్ కలసి ఉంటే ఈ కల నిజమవుతుంది" అని అన్నారు. మే 8న వైస్రాయ్ మౌంట్‌బాటన్ ఈ దిశగానే బ్రిటన్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాడు. ప్రతిపాదిత బంగాల్ దేశంలో హిందూ ముస్లింలకు జాయింట్ ఎలక్టొరేట్లు, మిలిటరీలో కూడా సమానమైన కోటా, ప్రభుత్వంలోనూ సమప్రాతినిధ్యం, ప్రధాని ముస్లిం... హోం మంత్రి హిందు... ఇలా ప్రణాళిక సిద్ధమైంది. 1947, మే 24న ఈ ప్రణాళిక బయటపెట్టారు. అంతకుముందు రోజే లండన్‌లో అట్లీ సారథ్యంలో సమావేశమైన బ్రిటన్ మంత్రిమండలి కూడా ఈ దిశగానే బంగాల్ కలసి ఉండాలని సూచించింది.
నెహ్రూ నో అనడంతో..