తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్గదర్శిపై చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన బహిరంగ నోటీసుపై ఏపీ హైకోర్టు స్టే

high court stay on margadarsi
high_court_stay_on_margadarsi

By

Published : Aug 11, 2023, 4:32 PM IST

Updated : Aug 11, 2023, 8:42 PM IST

16:24 August 11

ఆ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించిన ఏపీ హైకోర్టు

మార్గదర్శిపై చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన బహిరంగ నోటీసుపై ఏపీ హైకోర్టు స్టే

High Court Stay on Margadarsi: మార్గదర్శి చిట్ గ్రూపుల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ... చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వ నోటీసుపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు గుర్తుచేసింది. చందాదారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ప్రభుత్వ వెబ్​సైట్​లో ఉంచిన చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్.. ఈ ఏడాది జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీసు.. దాని ఆధారంగా చిట్ గ్రూపుల నిలిపివేతను సవాల్ చేస్తూ.. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ P.రాజాజీ... ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో ఇచ్చిన బహిరంగ నోటీసును సవాలు చేస్తూ 4 వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.

Margadarsi Case: 'మార్గదర్శి మూసివేతకు ఏపీ ప్రభుత్వ కుట్ర.. చట్టనిబంధనల ముసుగులో కక్షసాధింపు'

అలాగే ఈ సోమవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని.. పిటిషనర్ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. చిట్ గ్రూపులు నిలిపివేసే పరిస్థితే ఉత్పన్నం కానప్పుడు.. నోటీసిచ్చే అధికారం చిట్స్ రిజిస్ట్రార్​కు లేదన్నారు. 60 ఏళ్లుగా మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదూ లేదని.. సొమ్ము చెల్లించలేదనే ఆరోపణే రాలేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై దాడి ప్రారంభించిందని.. ఆ దాడుల్ని వివిధ సందర్భాల్లో తెలంగాణ, ఏపీ హైకోర్టులు తిప్పికొట్టి.. ఎప్పటికప్పుడు మధ్యంతర ఉత్తర్వులిచ్చాయని గుర్తుచేశారు. మార్గదర్శి ఛైర్మన్, ఎండీ, ఫోర్ మెన్ లపై 7 తప్పుడు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారని.. అరెస్టులు చేయడానికి కుట్రలు పన్నారని వాదించారు. ఈ వ్యవహారంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని.. పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు.

margadarshi chitfund : 'ఉల్లంఘనలు అబద్ధం.. ప్రభుత్వ దాడి నిజం'

ఇదే వ్యాజ్యాలకు సంబంధించి ఈ బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో.. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చిట్ గ్రూపుల నిలిపివేతకు.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. ఉల్లంఘనలు కొనసాగుతున్నందున.. అభ్యంతరాలను ఆహ్వానిస్తూ బహిరంగ నోటీసిచ్చామన్నారు. సుమోటోగా చర్యలు ప్రారంభించే అధికారం చిట్ రిజిస్ట్రార్లకు ఉందని తెలిపారు. ఫిర్యాదు కోసం.. వేసి చూడాల్సిన అవసరం లేదని.. 2008లో జారీ చేసిన జీవో ప్రకారం.. అసిస్టెంట్, డిప్యూటీ రిజిస్ట్రార్లకు అధికారాలను కేటాయించారని తెలిపారు.

ఆరోపణలే లేనప్పుడు సుమోటోగా సైతం చర్యలు ప్రారంభించలేరని... మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు.. దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ తనిఖీలు చేసి, డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్ గ్రూపుల నిలుపుదలపై అభ్యంతరాలను ఆహ్వానించడం చెల్లదన్నారు. సొమ్ము చెల్లించడం లేదనే ఆరోపణ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై లేదన్నారు. అలాంటప్పుడు.. చిట్ గ్రూపుల నిలుపుదలకు.. సుమోటోగా సైతం చర్యలు చేపట్టలేరన్నారు. అభ్యంతరాలను తెలపడానికి ఇచ్చిన గడువు ఈ నెల 14తో ముగుస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇచ్చిన బహిరంగ నోటీసు అమలును నిలిపివేయాలని కోరారు.

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

ఆ నోటీసు ఆధారంగా.. తదుపరి చర్యలు తీసుకోకుండా.. అధికారులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. ఇరువైపు వాదనలు ముగిసిన అనంతరం.. బుధవారం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య.. మార్గదర్శి సంస్థపై చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసుపై స్టే ఇచ్చారు. ఆ నోటీసు ఆధారంగా తీసుకోబోయే చర్యల్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. చందాదారులు, మార్గదర్శి వేసిన పిటిషన్లను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Last Updated : Aug 11, 2023, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details