తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Margadarshi Chitfund Case : సీఐడీ మాట మార్చేసిందిగా.. మార్గదర్శి విచారణలో వేధింపులే లక్ష్యంగా.. - మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు

Margadarshi Chitfund Case : మార్గదర్శి విచారణలో వేధింపులే లక్ష్యంగా సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ విచారణకు సహకరించారని మంగళవారం రాత్రి చెప్పిన దర్యాప్తు అధికారి... బుధవారం ఉదయం మాట మార్చేశారు. విచారణకు సహకరించలేదని కొత్త పల్లవి అందుకున్నారు.

సీఐడీ అధికారి
సీఐడీ అధికారి

By

Published : Jun 8, 2023, 7:34 AM IST

Updated : Jun 8, 2023, 8:04 AM IST

Margadarshi Chitfund Case : మార్గదర్శి విచారణలో ఏపీ సీఐడీ అధికారులు 14 గంటల్లో మాట మార్చేశారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ విచారణకు సహకరించారని మంగళవారం రాత్రి చెప్పిన దర్యాప్తు అధికారి... బుధవారం ఉదయం కొత్త పాట పాడారు. శైలజాకిరణ్‌ విచారణకు సహకరించలేదని కొత్త పల్లవి అందుకున్నారు. మంగళవారం విచారణకు సహకరిచారని మీరే చెప్పారుగా అని విలేకర్లు ప్రశ్నిస్తే... ఏవేవో పొంతనలేని సమాధానాలు చెప్పి మీడియా సమావేశం ముగించి వెళ్లిపోయారు.

సీఐడీ మాట మార్చేసిందిగా.. మార్గదర్శి విచారణలో వేధింపులే లక్ష్యంగా..

అక్కడో మాట.. ఇక్కడో మాట.. ఏపీ సీఐడీ అధికారులు కొన్ని గంటల్లోనే మాట మార్చేశారు. హైదరాబాద్‌లో ఓ మాట... అమరావతిలో మరో మాట చెప్పారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసులో భాగంగా సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను... మంగళవారం ఏపీ సీఐడీ అధికారుల బృందం విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత మంగళవారం రాత్రి ఎనిమిదిన్నరకు మీడియాతో మాట్లాడిన దర్యాప్తు అధికారి రవికుమార్‌... శైలజాకిరణ్‌ విచారణకు సహకరించారని స్పష్టంగా చెప్పారు. అనారోగ్యంతో ఉన్నా సరే అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సమాధానాలు ఇచ్చారని చెప్పారు.

ఎవరి ప్రోద్బలమో గానీ... అదే దర్యాప్తు అధికారి రవికుమార్‌ బుధవారం ఉదయం 11 గంటలకు మాట మార్చేశారు. ఎవరి ప్రోద్బలమో తెలియదు గానీ, కేవలం 14 గంటల తేడాలో ఆయన పూర్తిగా భిన్నవాదన వినిపించారు. శైలజాకిరణ్‌ తమ దర్యాప్తునకు సహకరించలేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఒక్క రాత్రిలోనే ఇలా మాట మార్చేయడం వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రశ్నిస్తే.. ఎవరి ఒత్తిళ్లూ లేవంటూనే పొంతనలేని సమాధానాలు చెప్పారు.

వేధించడమే లక్ష్యంగా.. చందాదారులు ఎవరూ ఫిర్యాదులు చేయకపోయినా సరే మార్గదర్శిని వేధించటమే లక్ష్యంగా సీఐడీ ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించగా... తాము విచారణ చేపట్టిన తర్వాత అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారని, వారి వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నామని చెప్పారు. మరి ఆ వివరాలు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయగా... ఆయన నుంచి సమాధానం రాలేదు. సీఐడీ ఐజీ సీహెచ్‌.శ్రీకాంత్‌తో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన... ప్రశ్నలకు సూటిగా సమాధానాలివ్వలేక ఆద్యంతం తడబడ్డారు.

మరోసారి నోటీసులు.. అదే సమయంలో మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నమోదు చేసిన కేసులను చట్ట పరిధిలోనే తాము దర్యాప్తు చేస్తున్నామని రవికుమార్‌ చెప్పారు. చిట్‌ఫండ్‌ చందాదారుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకే తాము చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు. విచారణ సమయంలో తాము ఎవర్నీ వేధించలేదని, నిజాల్ని రాబట్టడానికి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శైలజాకిరణ్‌కు మరోసారి నోటీసులిచ్చి విచారిస్తామని చెప్పారు. మార్గదర్శి ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

Last Updated : Jun 8, 2023, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details