కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరడం వల్ల నగరాల్లోని వలస కూలీల్లో దడ పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జనజీవనంపై ఆంక్షలు, రాత్రి పూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ పరిస్థితులు చూసి మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తారన్న భయాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ముంబయిలోని కూలీలు పెద్దఎత్తున సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గత మూడు రోజుల్లోనే 4.55 లక్షల మందికి పైగా సొంతూళ్లకు పయనమయ్యారు. అన్ని రైల్వే టెర్మినల్స్ వీరితోనే కిటకిటలాడుతున్నాయి. ముంబయి నుంచి బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్ వెళ్లే రైళ్ల బెర్తులన్నీ నిండిపోయాయి.
బస్సుల కోసం..
మహారాష్ట్రలో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం.. మినీ లాక్డౌన్ విధించింది. దాంతో నిత్యావసరాలు మినహా అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో హోటళ్లు, బార్లు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు గతేడాది లాగే తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌కు చెందిన కార్మికులు ఠాణెలోని మాజివడా బస్టాండ్‌కు భారీగా చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయా రాష్ట్రాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. దాంతో.. బస్సుల కోసం వందలాది మంది కార్మికులు నిరీక్షిస్తున్నారు.