Test tube baby government hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్రాణం పోశారు వైద్యులు. బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఐజీఐఎమ్ఎస్) ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించటం ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. ఐజీఐఎమ్ఎస్ ఐవీఎఫ్ కేంద్రంలో తొలిసారి బిడ్డకు జన్మనివ్వటం, ఆ పాప ఆరోగ్యంగా ఉండటం చాలా సంతోషకరమైన అంశమని ఆసుపత్రి సూపరింటెండెంట్ మనీశ్ మండల్ పేర్కొన్నారు.
సహస్రా ప్రాంతానికి చెందిన మిథిలేశ్ కుమార్, అనితా కుమారి దంపతులకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగినా.. పిల్లలు కలగలేదు. ఇటీవల ఐజీఐఎమ్ఎస్ ఆసుపత్రిని సంప్రదించారు. టెస్ట్ ట్యూబ్ బేబీ(ఐవీఎఫ్) విధానంపై ఆసుపత్రి వర్గాలు గత మూడేళ్లుగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మిథిలేశ్ దంపతులను వైద్యులు సంప్రదించి ఐవీఎఫ్ గురించి వివరించారు. అందుకు వారు ఒప్పుకోవటం వల్ల ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. వారి ప్రయత్నం విజయవంతమై అనితా కుమారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నో ఎళ్లుగా ఎదురుచూస్తున్న వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.