తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Terrorists hiding in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ ఉగ్ర కదలికలు - హైదరాబాద్​లో ఉగ్రమూకల కలకలం

Terror
Terror

By

Published : May 9, 2023, 12:27 PM IST

Updated : May 10, 2023, 6:55 AM IST

12:23 May 09

హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర మూకల కలకలం

Terrorists hiding in Hyderabad : కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో సమాచారంతో... హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఉగ్రమూలాలు వెలుగులోకి వచ్చాయి. ఇస్లామిక్ రాడికల్స్‌గా వ్యవహరిస్తున్న ఐదుగురిని మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఐదుగురు నిందితులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు భోపాల్ కు తీసుకెళ్లారు. భోపాల్‌లో ఇప్పటికే 11 మంది ఇస్లామిక్ రాడికల్స్ ను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు.. హైదరాబాద్ లో నిఘా పెట్టడంతో ఐదుగురి వివరాలు బయటికి వచ్చాయి. నిందితుల ఇళ్లల్లో ఎయిర్ గన్లు, పిల్లెట్లు, ఇస్లామిక్ జీహాద్ సాహిత్యం... కత్తులు, డాగర్లు స్వాధీనం చేసుకున్నారు.

Radical Islamic activists hiding in Hyderabad : ఇస్లామిక్ రాడికల్స్ గా అనుమానిస్తున్న వాళ్లలో ఓ మెడికల్ కళాశాలలో విభాగాధిపతిగా పనిచేస్తున్న మహ్మద్ సలీం ఉన్నట్లు గుర్తించారు. భోపాల్‌ కు చెందిన ఇతను కొన్నేళ్లుగా గొల్కొండలో ఉంటున్నట్లు.. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఒడిశాకు చెందిన అబ్దుర్ రహమాన్ క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్ గా పనిచేస్తూ.. గోల్కొండలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. గోల్కొండ బడా బజార్ కు చెందిన షేక్ జునైద్ డెంటిస్ట్ గా.. హఫీజ్ బాబా నగర్ కు చెందిన మహ్మద్ అబ్బాస్ అలీ ఆటో డ్రైవర్ గా, జగద్గిరిగుట్టలోని మగ్దూమ్ నగర్ కు చెందిన మహ్మద్ హమీద్ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు... ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. జవహర్ నగర్ లోని బాలాజీనగర్ కు చెందిన మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతను కూడా దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు తేల్చారు. ఇస్లాం రాడికల్స్​గా అనుమానిస్తున్న వాళ్లలో.. ముగ్గురు మతమార్పిడి చేసుకున్నారా అనే కోణంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మహ్మద్ సలీమ్ అలియాస్ సౌరబ్ రాజ్ వైద్య, అబ్దుర్ రహమాన్ అలియాస్ దేవి ప్రసాద్.. మహ్మద్ అబ్బాస్ అలియాస్ వేణు కుమార్ గా పేర్లు ఉన్నట్లు గుర్తించారు. నిఘా వర్గాలకు చిక్కకుండా ఇతర పేర్లను పెట్టుకున్నారా లేకపోతే హిందూ మతం నుంచి.. ముస్లిం మతంలోకి మారారా అనే వివరాలను... కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు.

గతేడాది అక్టోబర్‌లోనూ ఉగ్రకుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు: గతేడాది అక్టోబర్‌లోనూ ఉగ్రకుట్రను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన ఘటనలో.. ముగ్గురిని అరెస్టు చేశారు. దసరా ఉత్సవాల్లో సామూహిక పేలుళ్లకు వారు కుట్ర పన్నినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ లను అరెస్టు చేసి... చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా హ్యాండ్ గ్రనేడ్లను మనోహరాబాద్ కు చేరవేశారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనం ద్వారా హైదరాబాద్‌కు గ్రనేడ్లు తీసుకొచ్చిన నిందితులు... దసరా సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు నిందితులను గుర్తించగలిగారు. ముగ్గురు నిందితులకు ఆర్థిక సాయం చేసిన అబ్దుల్ కలీమ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 3 నెలల క్రితం అరెస్టు చేశారు.

ఎక్కడ ఉగ్ర కుట్రలు బయటపడినా హైదరాబాద్​తో సంబంధం: బిహార్‌లోని దర్బంగా రైల్వే స్టేషన్‌లోని 2021 జూన్ లో జరిగిన పేలుడుకు సంబంధించి.. హైదరాబాద్‌లో మూలాలు బయటపడ్డాయి. లష్కరే తోయిబాకు చెందిన ఇమ్రాన్ మాలిక్, నసీర్ మాలిక్.. హైదరాబాద్ మల్లేపల్లిలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటూ వస్త్ర వ్యాపారం నిర్వహించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన నిధుల ఆధారంగా.. రైల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు చీరలతో కూడిన పార్సిల్ లో.. బాంబులు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్సిల్ బుక్ చేశారు. కదులుతున్న రైల్లో బాంబు పేలి.. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేలా కుట్ర పన్నారు. అదృష్టవశాత్తు దర్బంగా రైల్వే స్టేషన్ లో పార్సిల్ కౌంటర్ లోకి దింపిన తర్వాత.. స్వల్ప పేలుడు జరిగింది. ఇలా దేశంలో ఎక్కడ ఉగ్ర కుట్రలు బయటపడినా హైదరాబాద్​తో సంబంధం ఉండటం దర్యాప్తు సంస్థలను ఆందోళన కలిగిస్తోంది.

వారిని ప్రశ్నించడం ద్వారా మరింత సమాచారం:ఇస్లామిక్ రాడికల్స్‌గా వ్యవహరిస్తున్న 16 మందిని ప్రశ్నించడం ద్వారా మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. భోపాల్ కు చెందిన వాళ్లతో హైదరాబాద్ కు చెందిన ఐదుగురికి ఎలా పరిచయం ఏర్పడింది అనే కోణంలో... పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. చరవాణిలను, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ లో విశ్లేషించడం ద్వారా... దర్యాప్తులో పురోగతి లభిస్తుందని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. దీని ఆధారంగా మరికొంత మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : May 10, 2023, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details