సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలోని ఆర్మీ క్యాంప్ వద్ద గురువారం ఉదయం జరిగిందీ ఘటన.
ఉరీ తరహా ఉగ్రదాడికి భారీ కుట్ర.. ఇద్దరు ముష్కరులు హతం.. ముగ్గురు జవాన్ల వీరమరణం - terror attack on indian army
07:48 August 11
ఆర్మీ క్యాంప్‌పై ఉగ్ర దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు.. ఇద్దరు ముష్కరులు హతం
దర్హల్ ప్రాంతం పర్గల్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. గురువారం వేకువజామున ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు హోరాహోరీ పోరు జరిగింది. చివరకు ముగ్గురు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి.
2016 సెప్టెంబర్‌లో ఉరీలోని సైనిక స్థావరంలోకి ఇదే తరహాలో ఉగ్రవాదులు చొరబడి భీకర దాడులు చేశారు. 19 మంది జవాన్లను బలిగొన్నారు. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు అదే తరహాలో రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నగా.. తాము భగ్నం చేశామని అధికారులు చెప్పారు.
పంద్రాగస్టు వేడుకలకు ముందు అలజడి సృష్టించడమే లక్ష్యంగా పాకిస్థానీ ఉగ్రవాదులు వరుస దాడులకు యత్నిస్తున్నారు. వారి కుట్రలను భగ్నం చేసేందుకు భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం జమ్ముకశ్మీర్ బుద్గాంలో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల్ని పోలీసులు హతమార్చారు.