Terror attack alert in Delhi: దిల్లీలో ఉగ్రదాడులు జరిపేందుకు కుట్ర జరుగుతోందని అందిన సమాచారం మేరకు అప్రమత్తమయ్యారు అక్కడి పోలీసులు. ఈ దాడులపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తమకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసినట్లు దిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం పేర్కొంది. దిల్లీలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు చేస్తామని 'తెహ్రీక్ ఈ తాలిబన్' ఉగ్రసంస్థ నుంచి కొందరికి ఈమెయిల్స్ వచ్చాయని పేర్కొంది. సమాచారం అందించిన యూపీ పోలీసులను ప్రశంసించింది.
దిల్లీలో ఉగ్రదాడులకు కుట్ర.. పోలీసుల హైఅలర్ట్!
Terror attack alert in Delhi: దిల్లీలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు చేపట్టేందుకు కుట్ర జరుగుతోందన్న సమాచారం మేరకు అప్రమత్తమయ్యారు పోలీసులు. మార్కెట్లు, రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తెహ్రీక్ ఈ తాలిబన్ సంస్థ పేరుతో పలువురికి మెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు.
దిల్లీ పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేయటం సహా ఈ సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టాలని సూచించింది ప్రత్యేక విభాగం. ముఖ్యంగా అన్ని మార్కెట్లలో భద్రతను దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మెయిల్ పంపిన వ్యక్తిని పట్టుకుని, అందులోని సమాచారాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు.. భద్రతాపరమైన ముప్పు కారణంగా మార్కెట్లను మూసివేసి కట్టుదిట్టమైన నిఘా వేయాలని దిల్లీ పోలీసులకు ఆదేశాలు అందినట్లు సరోజిని నగర్ మినీ మార్కెట్ ట్రేడర్స్ సంఘం అధ్యక్షుడు పేర్కొన్నారు. అయితే.. తాము తనిఖీలు చేసేందుకే వెళ్లామని, మార్కెట్లను మూసివేసేందుకు కాదని పోలీసులు తెలిపారు.
సరోజిని మార్కెట్లో ప్రతి అంగుళాన్ని జల్లెడపడుతున్నారు భద్రతా సిబ్బంది. అయితే, ఎలాంటి అనుమానాస్పద పదార్థం, సామగ్రి లభించకపోవటం వల్ల ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో కొద్ది సమయం మార్కెట్‌ను మూసివేశారు. ఇటీవల భోపాల్‌లో ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా.. భారత్‌లోని 9 రాష్ట్రాల్లో ఉగ్రదాడులు చేపట్టనున్నట్లు పోలీసులకు తెలిపాడు.