Terrace farming in Pune: పట్టణాలు కాంక్రీట్ జనారణ్యాలుగా మారిపోతున్న ఈ తరుణంలో మిద్దె తోటలకు ప్రాధాన్యం బాగా పెరిగింది. సరిగ్గా శ్రద్ధ పెట్టాలేగానీ.. మిద్దెపై పండించని పంట అంటూ ఏదీ లేదని కొందరు ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని.. కూరగాయలు, పూల మొక్కలు పెంచుతున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ రైతు మిద్దె సాగును మరో అంచెకు తీసుకెళ్లారు. రెండంతస్తుల తన ఇంటి టెర్రస్‌పై ఏకంగా ద్రాక్ష తోటనే పెంచేశారు.
కింద ఉన్న మట్టిలో ద్రాక్ష మొక్కలను నాటి.. వాటి తీగలను రెండో అంతస్తుపైకి పాకేలా చేశారు పుణె నగరానికి చెందిన రైతు బాహుసాహెబ్ కాంచన్. మిద్దెపైన కర్రలు, ఐరన్ రాడ్లను ఊతమిచ్చి ద్రాక్ష తోటను పెంచారు. పక్షులు, ఇతర జంతువుల బెడదలేకుండా.. చుట్టూ తెరలను ఏర్పాటు చేశారు. 2013లో యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి ప్రాంతాల్లో మిద్దెలపై ద్రాక్ష, ఇతర పండ్ల తోటలను పెంచటం చూసి స్ఫూర్తి పొందానని చెబుతున్నారు రైతు బాహుసాహెబ్.
2015లో మంజేరీ, మెదికా రకాలకు చెందిన ఐదు ద్రాక్ష తీగలను తీసుకున్నానని, వాటిని తన ఇంటి పెరటిలో నాటినట్లు చెప్పారు రైతు. ఈ తీగలు 30 అడుగులు పెరిగి.. మిద్దెపై 1100 చదరపు అడుగుల మేర విస్తరించాయన్నారు. శాస్త్రవేత్తలు సైతం తమ ఇంటికి వచ్చి.. పండ్ల నాణ్యతను పరీక్షిస్తామని చెప్పారని తెలిపారు.
"సమయం దొరికిన కొంత మంది ప్రజలు ఇక్కడికి చూసేందుకు వచ్చి ఆనందం వ్యక్తం చేస్తూనే.. మిద్దెపై ఇంత ఎక్కువ మొత్తంలో ఎలా సాగు చేయగలుగుతున్నారని ఆశ్చర్యపోతుంటారు. ఓసారి మహారాష్ట్రకు చెందిన ఓ రైతు నుంచి ఫోన్ వచ్చింది. మేము 20, 30, 50 ఎకరాల్లో ద్రాక్ష సాగు చేస్తున్నా మా పేరు ఎవరికీ తెలియదు.. ఇంటి మిద్దెపై చిన్న స్థలంలో మీరు సాగు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆ రైతు చెప్పారు. అలాంటిది ఏమీ లేదని నేను చెప్పాను. ఇంటి మిద్దెలపై ఏదైనా చేయవచ్చని నగరాల్లోని ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. అది కుటుంబ సభ్యుల్లో సంతోషాన్ని నింపుతుంది."