దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్యాలాల్ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఎలాంటి హింస జరగకుండా ఉండేందుకు ఉదయ్‌పుర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిపేశారు.
టైలర్ కన్హయ్య లాల్ మృతదేహానికి స్థానిక మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో భాజపా నేత గులాబ్‌చంద్ కటారియా ఎంబీ ఆస్పత్రికి చేరుకొని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
అంత్యక్రియలకు భారీగా జనం: కన్హయ్య లాల్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు, ప్రజాపతినిధులు హాజరయ్యారు. మృతదేహాన్ని ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హత్యను ఖండిస్తూ.. బైక్ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.