తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లఖింపుర్ ఖేరిలో రాహుల్​, ప్రియాంక.. బాధిత కుటుంబాలకు పరామర్శ - రైతుల నిరసన

Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Tuesday denied permission to a 5-member delegation of the Congress Party led by Rahul Gandhi to visit Lakhimpur Kheri district in the wake of Section 144 of the Criminal Procedure Code.

rahul lakhimpur visit
లఖింపుర్​లో రాహుల్​ పర్యటన

By

Published : Oct 6, 2021, 8:54 AM IST

Updated : Oct 6, 2021, 11:45 PM IST

22:16 October 06

బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్​, ప్రియాంక..

కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిర్బంధాల మధ్య ఎట్టకేలకు యూపీలోని లఖింపుర్‌ ఖేరి చేరుకున్నారు. లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను పరామర్శించారు. తొలుత 19 ఏళ్ల లవ్‌ప్రీత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. 

లఖింపుర్‌ ఖేరికి రాహుల్‌ వెళ్లకుండా ఈ రోజు ఉదయం లఖ్‌నవూ విమానాశ్రయం వద్ద ఆయన్ను యూపీ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు వెనక్కి తగ్గి ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించడంతో లఖ్‌నవూ నుంచి మధ్యాహ్నం బయల్దేరిన రాహుల్‌ గాంధీ.. తొలుత సీతాపూర్‌ చేరుకున్నారు. అక్కడ గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధంలో ఉన్న తన సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్దకు చేరుకున్నారు. రాహుల్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకోవడంతో సీతాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌  స్తంభించింది. 

కాంగ్రెస్‌ శ్రేణులు నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమెను అధికారులు నిర్బంధం నుంచి విడుదల చేయడంతో ఇద్దరూ కలిసి కొద్దిసేపటి క్రితమే లఖింపుర్‌ ఖేరికి చేరుకున్నారు. వీరి వెంట పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌, దీపీందర్‌ సింగ్‌ హుడా ఉన్నారు.

వెయ్యి వాహనాలతో..  

గురువారం వెయ్యి వాహనాలతో లఖింపుర్​కు వెళ్తామని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ హరిష్​ రావత్ తెలిపారు.  

18:36 October 06

లఖింపుర్​ ఖేరికి బయలుదేరిన రాహుల్​, ప్రియాంక

సితాపుర్​లోని పీఏసీ అతిథి గృహం నుంచి లఖింపుర్​ ఖేరికి బయలుదేరి వెళ్లారు కాంగ్రెస్​ నాయకులు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు. వారితో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. 

15:21 October 06

లఖింపుర్‌ బాధిత కుటుంబాలకు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు పరిహారం

లఖింపుర్‌ బాధిత కుటుంబాలకు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు నిర్ణయించారు.

15:13 October 06

లఖ్‌నవూ విమానాశ్రయంలో హైడ్రామా

లఖ్‌నవూ విమానాశ్రయంలో హైడ్రామా నెలకొంది. లఖింపుర్‌ బాధిత కుటుంబాల పరామర్శకు లఖ్‌నవూ వచ్చిన రాహుల్​ను పోలీసులు తమ వాహనాల్లో తీసుకెళ్లాలని చూడగా.. ఆయన​ నిరాకరించారు. సొంత కారులో లఖింపుర్‌ వెళ్తానని రాహుల్‌ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఏదో వ్యూహం రచిస్తున్నారని రాహుల్‌గాంధీ అనుమానం వ్యక్తం చేశారు.  

సొంత  వాహనంలో లఖింపుర్‌ వెళ్లేందుకు పోలీసులతో రాహుల్‌ చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఎట్టకేలకు సొంత వాహనంలో రాహుల్‌ వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. లఖ్‌నవూ నుంచి సొంత వాహనంలో లఖింపుర్​కు బయలదేరారు రాహుల్‌.

13:09 October 06

లఖింపుర్​లో పర్యటించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మరో ముగ్గురికి అనుమతి ఇచ్చింది ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర హోంశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. రాహుల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పిన కొద్ది సేపటికే ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది యూపీ ప్రభుత్వం.

12:19 October 06

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీ విమానాశ్రయం నుంచి యూపీ బయల్దేరారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం చరణ్​జీత్​ సింగ్ చన్నీ, ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్,  రణ్​దీప్​ సుర్జేవాలా ఉన్నారు. లఖింపుర్​ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్నారు. అయితే రాహుల్ పర్యటనకు అనుమతి లేదని యూపీ పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు.

10:34 October 06

'నియంత పాలనలో దేశం'

లఖింపుర్​ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత్​లో ప్రస్తుతం నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. అందుకే తమను ఉత్తర్​ప్రదేశ్​కు వెళ్లేందుకు అనుమతించటం లేదని చెప్పారు.  లఖింపుర్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.  

"రైతులపై జీపు దూసుకువెళ్లింది. వారిని హత్య చేశారు. దీంట్లో కేంద్ర మంత్రి, అతని కుమారుడి పేర్లు వినిపిస్తున్నాయి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లఖ్​నవూలో పర్యటించారు. కానీ, ఆయన లఖింపుర్​ ఖేరిని మాత్రం సందర్శించలేదు. ఇది రైతులపై ప్లాన్ ప్రకారం జరిగిన దాడి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

"రైతు కుటుంబాలకు మద్దతుగా, అక్కడి పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి మేం ఈరోజు ఉత్తర్​ప్రదేశ్​లో పర్యటిస్తాం"అని రాహుల్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీని సీతాపుర్​లో నిర్బంధించినప్పటికీ.. ఇది రైతులకు సంబంధించిన అంశమని చెప్పారు రాహుల్​. లఖింపుర్ హింసాత్మక ఘటనపై ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. 

08:20 October 06

లఖింపుర్​ ఖేరికి బయలుదేరిన రాహుల్​, ప్రియాంక

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​లో కాంగ్రెస్​ అగ్ర​నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi News) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పర్యటించేందుకు ఆ రాష్ట్ర​ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లఖ్​నవూలో 144వ సెక్షన్​ అమలవుతున్నందున ఈ పర్యటనకు అనుమతినివ్వట్లేదని స్పష్టం చేసింది. 

"రాష్ట్ర రాజధాని లఖ్​నవూలో సెక్షన్​ 144 విధించాం. నవంబర్​ 8వరకు ఇది అమల్లో ఉంటుంది. శాంతి భద్రతలను కాపాడటం సహా రానున్న పండుగలు, వివిధ ఎంట్రన్స్ పరీక్షలు, రైతుల నిరసనల  నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించేందుకు సెక్షన్​ 144ను విధిస్తున్నాం"అని అధికారిక ప్రకటనలో ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. 

అంతకుముందు.. కాంగ్రెస్​ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. లఖింపుర్ ఖేరీలో బుధవారం రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పర్యటించనుండగా.. ఇందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు అనుమతించిన విధంగానే రాహుల్​ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur violence news) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని (Priyanka Gandhi Latest News) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమైంది. 

అనుమతించం..

లఖింపుర్​ ఖేరి, సితాపుర్​లో పర్యటించేందుకు రాహుల్​ను అనుమతించబోమని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆయన పర్యటనతో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.  

"రాహుల్ గాంధీ పర్యటనకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. లఖింపుర్​, సితాపుర్​కు రావద్దని ఆయనను కోరాం. ఆయా జిల్లాల్లో రాహుల్ పర్యటిస్తే.. సమస్యలు తలెత్తుతున్నాయని సంబంధిత జిల్లా కలెక్టర్లు మాకు లేఖ రాశారు. రాహుల్​ పర్యటనకు అనుమతి లేదని వారు పేర్కొన్నారు. అందుకే రాహుల్​ను అనుమతించం."

-డీకే ఠాకూర్​,  లఖ్​నవూ పోలీస్ కమిషనర్​

Last Updated : Oct 6, 2021, 11:45 PM IST

ABOUT THE AUTHOR

...view details