తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దొమ్మేరులో హోంమంత్రిని అడ్డుకున్న స్థానికులు - ఉద్రిక్తత - ఎస్సీ యువకుడి ఆత్మహత్య లేటెస్ట్ అప్డేట్స్

Tension_in_Dommeru
Tension_in_Dommeru

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 4:05 PM IST

Updated : Nov 16, 2023, 7:28 PM IST

16:00 November 16

బుధవారం ఎస్సీ యువకుడు మహేంద్ర ఆత్మహత్య

దొమ్మేరులో హోంమంత్రిని అడ్డుకున్న స్థానికులు - ఉద్రిక్తత

Tension in Dommeru: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దొమ్మేరులో బుధవారం ఎస్సీ యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకోగా.. కుటుంబసభ్యులను పరామర్శించేందుకు హోం మంత్రి తానేటి వనిత వచ్చారు. హోం మంత్రి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు అడ్డుకునేందుకు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి స్థానికులను నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

హోం మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం, హోం మంత్రి వనిత, పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ యువకుడు మహేంద్ర.. పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న యువకుడ్ని విజయవాడ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. దొమ్మేరులో వైసీపీకి చెందిన ఓ ఫ్లెక్సీ చిరిగిపోయిన వివాదంలో.. ఎస్సీ యువకుడు మహేంద్రను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తీవ్ర ఉద్రిక్తతల నడుమ మహేంద్ర అంత్యక్రియలు పూర్తి

పొలం పనులు చేసుకుంటున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. సీఐ రమ్మంటున్నారని చెప్పి.. యువకుడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఫ్లెక్సీ వివాదంతో సంబంధం లేదని చెప్పినా.. సాయంత్రం వరకూ స్టేషన్‌లోనే ఉంచారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహేంద్ర.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి మహేంద్రను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. యువకుడు మృతిచెందాడు.

యువకుడి మృతదేహాన్ని తీసుకుని పోలీసులు తెల్లవారుజామున దొమ్మేరుకు తీసుకురాగా.. స్థానికులు పోలీసులపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. సీసాలు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏఎస్సైకు గాయాలయ్యాయి. పోలీసుల వ్యవహారశైలి వల్లే మహేంద్ర మృతిచెందాడని కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబసభ్యులను తెలుగుదేశం, జనసేన నాయకులు, ప్రజాసంఘాల నేతలు పరామర్శించారు.

ఎస్సీ యువకుడి లాకప్​డెత్​... మధ్యవర్తితో రాజీయత్నం...!

వైసీపీ పాలనలో ఎస్సీలపై జరుగుతున్న దాడులు, అరాకచంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హోం మంత్రి తానేటి వనిత, మంత్రి మేరుగ నాగార్జున దొమ్మేరుకు రాగా.. వారి రాకను స్థానికులు.. ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. గ్రామంలోకి వారిని రానివ్వబోమని.. అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు బలగాలు భారీగా చేరుకుని.. స్థానికులను నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. మంత్రి మేరుగ నాగార్జున.. స్థానికులు, మృతుడి కుటంబసభ్యులతో మాట్లాడి.. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

హోం మంత్రి వనితపై స్థానికులు తీవ్ర ఆగ్రహోద్రిక్తులు కావడంతో.. ఆమెను పోలీసులు గ్రామానికి దూరంగానే నిలిపేసి.. ఎస్సీ కాలనీకి వెళ్లనీయలేదు. ఆత్మహత్య చేసుకున్న మహేంద్ర కుటుంబానికి రూ.20 లక్షల పరిహారాన్ని అందజేశారు. మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే తలారి వెంకటకృష్ణ ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేశారు. మరో 10 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ అందజేశారు.

అవమానం భరించలేక రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్న యువకుడు

Last Updated : Nov 16, 2023, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details