Challenges Between YSRCP and TDP Leaders: పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య మొదలైన మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇసుక అక్రమ తవ్వకాలు, నియోజకవర్గ అభివృద్ధిపై.. అమరేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేద్దామంటూ ఇరువర్గాలు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరిన కొమ్మాలపాటి శ్రీధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొమ్మాలపాటిని వాహనంలో పోలీసులు తిప్పుతున్నారు. అమరావతిలోపలువురు తెదేపా నేతలు,కార్యకర్తలనుఅరెస్టుచేసిక్రోసూరు స్టేషన్‌కు తరలించారు.
అంతకుమందు పోలీసులతో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో.. వారిని పోలీసులు చెదరగొట్టారు. నంబూరు శంకర్రావు సైతం ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై రోడ్డుపై బైఠాయించి.. టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైసీపీ కార్యకర్తలు.. కర్రలు పట్టుకుని తిరుగుతూ కాసేపు వీరంగం సృష్టించారు. కర్రలను వైసీపీ శ్రేణుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్: అమరావతిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. నదిలో తవ్విన గోతుల వల్ల అనేకమంది చనిపోతున్నారని ఆరోపించారు. ఇసుక తవ్వకాల్లో చట్టప్రకారమే ముందుకెళ్లాలని కోరామని చెప్పారు. టీడీపీ పాలన నాటి అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధమని సవాల్ చేశారు. ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, ఇళ్ల నిర్మాణంపై చర్చకు సిద్ధమన్నారు. పోలీసు బలగాలతో మమ్మల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో తప్ప వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి లేదని కొమ్మాలపాటి అన్నారు. ఎమ్మెల్యే, వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు.
"ఈ రోజు అవినీతి అక్రమాలతో సాగుతోంది. దోచుకున్నాం..దాచుకున్నాం.. అనే విధానం ఉంది. అక్రమ మైనింగ్ జరుగుతోంది. దమ్ముందా అని అన్నారు.. మా దగ్గర దమ్ముంది.. ధైర్యం ఉంది". - కొమ్మాలపాటి శ్రీధర్
సవాల్‌ను స్వీకరించిన నంబూరి:ఈ ఉత్కంఠ నేపథ్యంలో.. టీడీపీ నేతల సవాలును తాను స్వీకరించానని నంబూరు శంకర్రావు ప్రకటించారు. ఆధారాలతో సహా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని.. టీడీపీ నేతల అవినీతిని స్వామివారి గుడి వద్ద నిరూపిస్తానని తెలిపారు. తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఆధారాలతో వివరిస్తానని అన్నారు. టీడీపీ శ్రేణులు భారీగా అమరావతికి వస్తున్నారని.. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అమరావతికి తరలి రావాలని పిలుపునిచ్చారు. అదే విధంగా పోలీసులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు సహకరించాలని కోరారు.