పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించిన దుండగులు.. కారణమదేనా?
19:03 May 21
పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించిన దుండగులు
Nagaon Police Station Fire: అసోం నగావ్ జిల్లాలోని బటద్రవా పోలీస్ స్టేషన్‌కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి సఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తిని బటద్రవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రూ. 10వేలు లంచంగా ఇస్తే విడిచి పెడతామని చెబుతూ కుటుంబ సభ్యుల ముందే సఫీకుల్‌ను పోలీసులు కొట్టినట్లు స్థానికులు ఆరోపించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన సఫీకుల్ కుటుంబం తిరిగి పదివేల రూపాయలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. అప్పటికే అతడ్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారని పేర్కొన్నారు.
పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన సఫీకుల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడి కుటుంబ సభ్యులు అతని బంధువులు.. పోలీసు స్టేషన్‌ను ముట్టడించి నిప్పంటించారు. "కొందరు దుండగులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. దర్యాప్తు చేసి మిగతా నిందితులను పట్టుకుంటాం. అయితే లంచం డిమాండ్ ఘటనపై పోలీసులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం" అని నగావ్ పోలీస్ సూపరింటెండెంట్ లీనా డోలీ తెలిపారు.
ఇదీ చదవండి: సొరంగంలో పెను విషాదం.. తొమ్మిది మృతదేహాలు వెలికితీత