TENSION AT GITAM UNIVERSITY : గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మెడికల్ కళాశాల వద్ద ఉన్న4.8 ఎకరాల స్థలానికి కంచె వేసే పనిని రెవెన్యూ అధికారులు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది . బారికేడ్లు పెట్టి ఎవరినీ అటువైపు వెళ్లనీయకపోవడంతో వాహనదారులు, స్థానిక అపార్టెమెంట్ల వాసులు ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వ భూములు పరిరక్షణలో భాగంగా పని చేశామని ఆర్డీవో చెప్పగా.. తమ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇతందా చేస్తున్నారని తెలుగుదేశం ఆరోపించింది.
అర్ధరాత్రి నుంచి ఆర్డీవో భాస్కర్ రెడ్డి , ఇతర రెవెన్యూ అధికారులు బృందాలుగా గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణానికి చేరుకొని.. సర్వేయర్లు గుర్తించిన హద్దుల ప్రకారం.. కంచె వేసే పనులు చేపట్టారు. వీరి పనికి ఆటంకం లేకుండా చేసేందుకు పోలీసులు ఈ ప్రాంతం దరిదాపుల్లో ట్రాఫిక్ లేకుండా నియంత్రించారు. గీతం పరిసరాల్లోనూ భారీగా పోలీసులు మోహరించారు. ఏసీపీ మూర్తి, శ్రీనివాస్, త్రినాధ్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇస్కాన్ ఆలయం వద్దనే బారికేడ్లు ఏర్పాటు చేసి.. బీచ్ రోడ్లో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వెళ్లాల్సిందిగా వాహనదారులకు ఆంక్షలు పెట్టారు. ఎండాడ వద్ద స్కై లైన్ అపార్ట్మెంట్ వద్దే బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఎవరిని అటువైపు వెళ్లకుండా నియంత్రించారు. పోలీసు చెక్ పోస్ట్ తో స్థానికులు అవస్థలు పడ్డారు. అపార్ట్ మెంట్ వాసులు అసహనం వ్యక్తం చేశారు.
గీతం కాలేజ్ ప్రాంగణానికి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి చేరుకుని పరిశీలించారు. గీతం యూనివర్సిటీ ముందు బారికేడ్ వద్ద గండి బాబ్జిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ సమయంలో ఏసీపీ శ్రీనివాస్ ను గండి బాబ్జి ప్రశ్నించారు.సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని గండి బాబ్జి కోరారు. గీతం విశ్వ విద్యాలయం పై కక్ష సాధింపు జరుగుతోందని నిజంగా ప్రభుత్వ భూమి ఉంటే ఒకేసారి తీసుకోవాలి కానీ...ఇలా ప్రతి సారి ఇబ్బంది పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు.