ఛత్తీస్‌గఢ్.. రాయ్‌పుర్‌లోని ఆగ్నేయ మధ్య రైల్వేలో అరుదైన కారుణ్య నియామకం జరిగింది. 10 నెలల రాధిక అనే బాలికకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ రిజిస్ట్రేషన్‌ను బుధవారం పూర్తి చేశారు రైల్వే అధికారులు. బాలికకు 18 ఏళ్లు నిండాక.. రైల్వే శాఖ ఆ ఉద్యోగాన్ని ఇవ్వనుంది. ఆగ్నేయ మధ్య రైల్వే చరిత్రలో ఇంత చిన్న వయసు వారికి కారుణ్య నియామకం ఇవ్వడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.
అసలేం జరిగిందంటే: రాధిక తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్.. భిలాయ్‌లోని పీపీ యార్డ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రాజేంద్ర.. ఛరోడాలోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండేవాడు. జూన్ 1న రాజేంద్ర, అతని కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర, అతని భార్య మంజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి పాప ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. అప్పటి నుంచి రాధిక.. అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉంటుంది.