TDP National General Secretary Nara Lokesh fire on CM Jagan: పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసికట్టుగా పని చేయాలన్న యువనేత.. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులకు కూడా నీరు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
120వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 120వ రోజుకు చేరుకుంది. ఈ 120వ రోజు పాదయాత్రను ఆయన కడప జిల్లాలో ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా యువనేత లోకేశ్.. న్యాయవాదులతో, పులివెందుల పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలను, సవాళ్లను, వారి డిమాండ్లను తెలుసుకున్న ఆయన.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదుల కోసం ఏయే పథకాలు ప్రవేశపెట్టనున్నారో..?, ఎక్కడెక్కడ కోర్టులు ఏర్పాటు చేయనున్నారో..?, న్యాయవాదులు మరణిస్తే ఆ కుటుంబానికి ఎంత సాయం చేయనున్నారో..? వంటి వివరాలను వెల్లడించారు. అనంతరం పార్టీ కోసం నిజాయితీగా పని చేసిన వారికే సీట్లు ఇస్తామని యువనేత లోకేశ్ ప్రకటించారు.
వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు..యువగళం పాదయాత్రలో భాగంగా ఈరోజు నారా లోకేశ్ పులివెందులలో పర్యటించారు. ఈ పర్యటనకు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. పులివెందులలో గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదన్నారు. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులను కూడా అభివృద్ది చేశామన్నారు. పులివెందులకు టీడీపీ..నీరు ఇచ్చింది, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. దీంతోపాటు రాజకీయ అవకాశాలను కూడా ఎక్కువగా కల్పించామన్నారు.
అటువంటివారికే వారికే పదవులు ఇస్తాం.. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పులివెందుల ప్రజలు కూడా బాధితులేనని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 90 వేల మెజారిటీతో జగన్‌ను పులివెందుల ప్రజలు గెలిపించినందుకు.. పులివెందులకు జగన్ ఏం చేశాడు..?, జయంతిలకు, వర్ధంతిలకు రావడం తప్ప.. జగన్ పులివెందులకు చేసింది ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అనంతరం సీనియర్, జూనియర్లను సమానంగా గౌరవిస్తామన్న ఆయన.. పార్టీ కోసం పని చేసే వారికే పదవులు ఇస్తామని ప్రకటించారు. నాయకులు అందరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని, కేసులకు భయపడి ఇంట్లోనే ఉంటామంటే ప్రజలు హర్షించరని గుర్తు చేశారు. పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుందనీ నారా లోకేష్ సూచించారు.