Telugu Desam Activists Protest Across the State:అధినేత అరెస్టుపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని నిరసనల కదంతొక్కాయి. కాగడాలు, కొవ్వత్తుల ప్రదర్శనలతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపాయి. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
District wise protests:చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరెత్తించారు.
NTR District.. ఎన్టీఆర్ (NTR) జిల్లా మైలవరంలో నిరసన తెలిపిన తెలుగు యువత అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరులపాడులో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన తెలిపారు. తిరువూరులో మధిర రోడ్డు సెంటర్ నుంచి చీరాల సెంటర్ వరకు ర్యాలీ తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. గుడివాడలో వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది.
Visakhapatnam..విశాఖ జిల్లా తగరపువలసలో సీఎం దిష్టిబొమ్మల దగ్ధం చేశారు . భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబును పోలీసులు అరెస్టు చేశారు. తాళ్లవలసలో మానవహారం చేశారు. భీమునిపట్నంలో తెలుగు యువత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
Nellore District..నెల్లూరులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేసి.. రోడ్లపై టైర్లు దహనం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. వరికుంటపాడు, కలిగిరి, ఉదయగిరి, సీతారాంపురంలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
Kadapa District..కడపలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. నల్ల కండువాలు, బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బద్వేలులో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గాంధీ విగ్రహం నుంచి సోమప్ప కూడలి వరకు ర్యాలీ చేశారు. ఆదోనిలో తిమ్మరెడ్డి బస్ స్టాండ్ కూడలిలో మనవహారం చేశారు.
Chittoor District..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రహదారులపైకి చేరిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పెనుమూరు, శ్రీరంగరాజపురం , కార్వేటినగరం , వెదురుకుప్పంతో పాటు జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు. కుప్పంలో టీడీపీ శ్రేణులు కాగడాలతో నిరసన తెలిపాయి . ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో కాగడాలతో తెలుగు మహిళలు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Srikakulam District.. శ్రీకాకుళం రూరల్ పోలీసుస్టేషన్ వద్ద మహిళలు బైఠాయించారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారిని స్టేషన్‌లో నిర్బంధించడం తగడన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు . ఇచ్చాపురంలో ఎమ్మెల్యే(MLA) అశోక్ బస్టాండ్ కూడలి వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.