చేతిలో ప్లకార్డులు పట్టుకుని, పుణె రోడ్లపై తిరుగుతున్న ఈ యువకుడు.. ప్రస్తుతం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణ. 'మీ కథ నాతో చెప్పుకోండి, నేనే మీకు 10 రూపాయలిస్తా!' ఆ కుర్రాడు పట్టుకున్న అట్టముక్కపై రాసున్న మాటలివి. ఆ కుర్రాడి పేరు రాజ్ డగ్‌వార్. వృత్తిరీత్యా కంప్యూటర్ ఇంజినీర్ అయిన రాజ్.. మానసిక ఒత్తిడి ఎంత ప్రమాదకరమో గుర్తించాడు. అందుకే ఒత్తిడితో సతమతమవుతున్న వారికి సహాయం చేయాలనుకున్నాడు.
''మానసికంగా కుంగిపోతున్న వారు మనచుట్టూనే ఎంతోమంది ఉంటారు. తమ బాధలు చెప్పుకోవడానికి వారికి ఎవరూ ఉండరు. చెప్తే వాళ్లేమనుకుంటారో అని చాలామంది భయపడుతుంటారు. అలాంటి వాళ్లకోసమే నేనిక్కడ ఉన్నా. ఎవరైనా తమ బాధను నాతో పంచుకోవచ్చు. అలా చేస్తే 10 రూపాయలిస్తా. డబ్బు.. చిన్న సాయంగా మాత్రమే.''
- రాజ్ డగ్‌వార్
ప్రతి ఒక్కరూ ఎవరి పనులతో వాళ్లు తీరికలేకుండా గడుపుతూ, పక్కవారితో మనసారా మాట్లాడుకునే పరిస్థితులే లేని రోజులివి. అందుకే మానసిక ఆరోగ్యం గాడితప్పుతోంది. జీవితంలో వివిధ కారణాలతో మానసికంగా కుంగిపోయేవారికి సాయం చేసేందుకు.. ఓ శ్రోతగా ప్రయాణం ప్రారంభించాడు రాజ్. ఈ ఆలోచన గురించి తెలుసుకున్నవారెవరైనా రాజ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
''ఇదొక మంచి కార్యక్రమం. తమ బాధలు పైకి చెప్పుకోలేని వారు ఇక్కడికొచ్చి, ఏ బెరుకూ లేకుండా ఆ అబ్బాయితో చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్లిద్దరూ ఒకరికొకరు తెలియదు.''
- స్థానిక యువతి