Telia Bhola fish: బంగాల్‌లోని తూర్పు మెదినీపుర్ జిల్లా దిఘా ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. అరుదైన తేలియా భోలా చేప ఒకటి చిక్కితేనే అదృష్టం వరించినట్లు భావిస్తారు మత్య్సకారులు. అలాంటిది వీరి వలలో 121 తేలియా భోలా చేపలు పడ్డాయి. ఒక్కోటి 18 కేజీలు ఉన్న ఆ చేపల ఖరీదు దాదాపు రూ.2 కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బిషేశ్వరి అనే నౌకలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను ఈ అదృష్టం వరించింది. కొత్త సంవత్సరంలో తేలియా భోలా చేపలు వలలో పడడం ఇదే తొలిసారని మత్స్యకారులు తెలిపారు. లోతైన సముద్రంలో గుంపులు గుంపులుగా తిరిగే తేలియా చేపలు చాలా అరుదుగా దొరుకుతాయని చేపల వ్యాపారి గిరీష్ చంద్ర రౌత్ తెలిపారు. సాధారణంగా భోలా చేపలు కిలో రూ.13 వేలు ధర పలుకుతాయని వెల్లడించారు.