తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TS Govt Letter to KRMB : కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

TS Govt Letter to KRMB
TS Govt Letter to KRMB

By

Published : May 25, 2023, 7:09 PM IST

Updated : May 25, 2023, 7:53 PM IST

19:05 May 25

TS Govt Letter to KRMB : కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

TS Govt Letter to KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు లేకుండా చిత్తూరు జిల్లాలో ఆవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ నిర్మిస్తుందని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. ఎన్జీటీ స్టే ఇచ్చి.. జరిమానా విధించినప్పటికీ పనులు కొనసాగిస్తున్నారని ఆయన బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని.. రిజర్వాయర్ పనులు చేపట్టకుండా ఏపీని నిలువరించాలని కోరారు.

ఆ నీటిని వాడుకోకుండా చూడాలి..: ఇదిలా ఉండగా.. ఉమ్మడి జలాశయాల నీటి వాటాకు సంబంధించి రెండు నెలల క్రితం సైతం నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌ కేఈర్‌ఎంబీకి లేఖ రాశారు. ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకుందని.. ఇక నుంచి నీటిని వాడుకోకుండా చూడాలని ఆయన కోరారు. ఈ మేరకు మురళీధర్ లేఖ రాశారు. ప్రస్తుత సంవత్సరంలో ఫిబ్రవరి నెల చివరి వరకు ఆంధ్రప్రదేశ్‌ 673 టీఎంసీల కృష్ణా జలాలను ఉపయోగించుకుంటే.. తెలంగాణ కేవలం 211 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుందని లేఖలో తెలిపారు. 971 టీఎంసీల్లో ఏపీ 74 శాతానికి పైగా వాడుకుందని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం తన వాటాకు మించి 32 టీఎంసీలను అధికంగా వినియోగించుకుందని.. రాష్ట్రానికి ఈ ఏడాది ఇంకా 108 టీఎంసీలు వాటాగా దక్కాల్సి ఉందని వివరించారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్​లో ఇంకా కేవలం 76 టీఎంసీల నీరు మాత్రమే ఉందని... ఇదే సందర్భంలో ఏపీ తన వాటాకు మించి నీటిని తీసుకొందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఇక నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని వినియోగించకుండా చూడాలని బోర్డును కోరారు.

దిల్లీకి చేరిన పంచాయితీ..: బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో చిన్న నీటి వనరులను మినహాయించి మిగిలిన నీటిని 66:34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వినియోగించుకొంటుండగా, వచ్చే నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు ఉండాలని తెలంగాణ కోరింది. దీనిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని ఛైర్మన్‌ ప్రకటించారు. కేంద్రం నుంచి నిర్ణయం వచ్చేవరకు నీటి విడుదలపై ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకొంటుంది. ఈ కమిటీలో బోర్డు సభ్యుడితో పాటు రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. 2022-23వ నీటి సంవత్సరంలో 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలన్న తెలంగాణ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. 34% నీటినే పూర్తిగా వినియోగించుకోలేదని ఏపీ ప్రతినిధులు ప్రస్తావించగా... తమ వాటాలో మిగిలితే కొత్త ప్రాజెక్టులకు వినియోగించుకుంటామని తెలంగాణ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలలో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకొనేలా 2015లో అవగాహన కుదిరింది. నాటి నుంచి ప్రతి ఏడాది అదే పద్ధతి కొనసాగుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ కేంద్రం వద్దకు వెళ్లనుంది.

ఇవీ చూడండి..

KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ

Last Updated : May 25, 2023, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details