Telangana Political Parties MLA Tickets Disputes 2023 : రాష్ట్రంలో ఎన్నికల వేళ.. ప్రతీ రాజకీయ పార్టీకి అసమ్మతి సెగ సర్వసాధారణం. తాజా ఎన్నికల్లోనూ అధికార బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకు తిరుగుబాటుదారుల బెడద పొంచి ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కిన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు టిక్కెట్ ఆశలు గల్లంతైన ఆశావహుల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కానున్న తరుణంలో ఆయా నేతలను వదులుకోరాదని, విజయానికి వారి సాయం తీసుకోవాలని పార్టీల అధిష్ఠానాలు భావిస్తున్నాయి. వారికి నచ్చజెప్పి టికెట్ ఇచ్చిన అభ్యర్థులతో కలిసి పనిచేయించేలా ఒప్పిస్తున్నాయి.
బాధ పడొద్దు.. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది :గతంలో లాగా.. సస్పెన్షన్లు, తొలగింపుల వంటి కఠిన చర్యలు తీసుకోకుండా.. హితబోధతో రేపు గెలిస్తే నామినేటెడ్ పదవులతో పాటు ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ శాంతింపజేసేందుకు యత్నిస్తున్నాయి. అనివార్య పరిస్థితుల కారణంగానే మీకు టికెట్ ఇవ్వలేకపోయాం. బాధ పడొద్దు. పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయండి. మనమే అధికారంలోకి వస్తాం. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. వాటి ద్వారా ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీల పదవులు పొందొచ్చు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తగిన అవకాశమిస్తాం అంటూ అసంతృప్తులను బుజ్జగిస్తున్నాయి.
BRS Leaders Ticket Clashses in Telangana : బీఆర్ఎస్లో సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తారనే ప్రచారం ముందునుంచీ జరిగినా.. కొందరినైనా మారుస్తారని ఆ పార్టీ నేతలు ఎంతగానో ఆశించారు. అలాంటి వారికి చుక్కెదురైంది. పలుచోట్ల సిట్టింగు ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేశారు. వారంతా సీనియర్లు, ముఖ్యనేతలు కావడం వల్ల అధిష్ఠానం వారిని దూరం చేసుకోవద్దనే తపనతో బుజ్జగింపులు మొదలుపెట్టింది. షెడ్యూల్ రావడానికి ముందే కొందరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల పదవులిచ్చింది. ఆ తర్వాత మరికొందరికి హామీలు ఇస్తోంది.
జోరందుకున్న బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం
బీఆర్ఎస్లో అసమ్మతితో పార్టీ నేతలను కాపాడుకోవడం గులాబీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారోననే అయోమయం నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గల్లో లోకల్ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మొన్నటి వరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉన్నవారు సైతం హస్తం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీనిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్(BRS Party)అధిష్ఠానం వ్యూహాలు రచిస్తోంది. ఆయా నేతలను బుజ్జగించే పనిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగి భుజానికెత్తుకున్నారు.
ఇప్పటికే జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి అక్కడి నుంచి పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సయోధ్య కుదిర్చారు. ఘన్పూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్యకు రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించి అక్కడ అసమ్మతిని చల్లార్చారు. ప్రస్తుతం కడియం శ్రీహరికి రాజయ్య మద్దతుగా నిలుస్తున్నారు. తాండూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి టికెట్ ఖరారు కాగానే.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. నియోజకవర్గాల్లో పార్టీకి దూరమయ్యే అవకాశం ఉన్న నేతలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Telangana Congress MLA Candidates Issues : ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ అసమ్మతి బెడద తీవ్రస్థాయికి చేరింది. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడగా.. చాలామందికి నిరాశే ఎదురైంది. తీవ్ర అసమ్మతి వ్యక్తమైన పరిస్థితిని గమనించిన అధిష్ఠానం వారితో ప్రత్యేకంగా మాట్లాడింది. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దాదాపు వేయికి పైగా పదవులుంటాయని, వాటన్నింటినీ టికెట్ రాని నేతలకే ఇస్తామని నమ్మకంగా చెబుతోంది. కాంగ్రెస్ రెండు విడతల్లో వంద మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో దాదాపు 30 మంది పక్క పార్టీల నుంచి వచ్చినవారే ఉండటంతో.. ఆయా స్థానాల్లో టికెట్‌పై ఆశ పెట్టుకున్నవారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొంతమంది ఇప్పటికే పార్టీ మారారు. మరికొందరు అనుచరులతో సమావేశాలు పెడుతూ భవిష్యత్ కార్యచరణపై సమాలోచనలు చేస్తున్నారు.