Telangana Political Parties Manifesto Lists:ఎన్నికల్లో.. హామీలనే ప్రధాన అస్త్రాలుగా పార్టీలు భావిస్తుంటాయి. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆకర్షణీయ పథకాలతో మేనిఫెస్టోలను(Telangana Manifesto) రూపొందిస్తుంటాయి. ఒక పార్టీని మించిన హామీలతో.. అన్ని వర్గాల్ని తమవైపునకు తిప్పుకునేలా ఎన్నికల ప్రణాళికను తీర్చిదిద్దుతాయి. ప్రజాకర్షక హామీలను రూపొందించి.. వాటినే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటాయి. ఒక పార్టీ వారు ఒకటిస్తే.. మేము రెండిస్తామంటూ.. అడిగిన వాటినే కాదు.. అడగని వాటినీ చేస్తామంటూ ఢంకా భజాయిస్తుంటారు. హోరాహోరీని తలపిస్తున్న శాసనసభ ఎన్నికల్లోనూ.. పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేశాయి. 'వరాలు ప్రకటించేయ్-ఓట్లు పట్టేసెయ్' అనే తీరుగా రాష్ట్రం రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నందున.. క్షేత్రస్థాయిలో నేతలు వీటినే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటూ.. ఓట్లు రాబట్టేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నారు.
BRS Manifesto 2023 : అక్టోబర్ 15నే 'కేసీఆర్ భరోసా(KCR Barosa)' పేరుతో మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ విడుదల చేసింది. విజయవంతంగా అమలవుతున్న పథకాల్ని కొనసాగిస్తూనే.. కొన్ని కొత్త పథకాల్ని ప్రకటించింది. ఓటర్లను ఆకట్టుకునేలా 'కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికీ ధీమా' అనే కొత్త పథకాన్ని తెచ్చింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి.. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రూ.5లక్షల బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. 'తెలంగాణ అన్నపూర్ణ' పథకం ద్వారా తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు.
రూ.400లకే సిలిండర్, పేద మహిళలకు రూ.3000 భృతి, స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల ఫించన్లను రూ.2016 నుంచి దశలవారీగా ఐదేళ్లలో రూ.5000లకు పెంపు, దివ్యాంగులకు రూ.4000 ఫించను.. రూ.6000 పెంచుతామన్న హామీలను ప్రకటించింది. రైతుబంధు దశల వారీగా రూ.16వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి రూ.15 లక్షలకు పెంపు, హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్‌మెంట్ భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత, అగ్రకులాల పేదలకూ గురుకులాలు, అనాథ పిల్లలకు ప్రత్యేక విధానం, సీపీఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు కమిటీ వంటి అంశాల్ని కేసీఆర్ భరోసాలో కీలక హామీలుగా ప్రకటించింది.
అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.15 లక్షల వైద్య సేవలు : అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో.. జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్యసేవలు అందిస్తామని మేనిఫెస్టో(BRS Manifesto)లో కేసీఆర్ హామీ ఇచ్చారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని.. భవిష్యత్‌లో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తామని చెప్పారు. బీసీల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. మేనిఫెస్టో హామీల అమలు 6నెలల్లో ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
BRS Manifesto 2023 : వృద్ధులకు రూ.5016, దివ్యాంగులకు రూ.6016.. రైతుబంధు కింద రూ.16 వేల సాయం
Telangana Congress Party Manifesto 2023 : అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఆరు గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్లతో ప్రచారంలో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ.. జనాకర్ష మేనిఫెస్టోను ముందుకు తీసుకొచ్చింది. గాంధీభవన్ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేస్తామని.. ఆర్టీసీ ఉద్యోగులను వేతన సవరణ పరిధిలోకి తెస్తామని తెలిపింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్, భూ హక్కుల సమస్యల పరిష్కరానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. పేదలకు పంచిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు, సర్పంచుల ఖాతాల్లోకి పంచాయతీ నిధులు బదిలీ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది.
మూతబడిన 6 వేల పాఠశాలల పునరుద్ధరణ సహా కొత్తగా 4 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రోలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50 శాతం రాయితీ ప్రకటించిన కాంగ్రెస్.. ఎల్బీనగర్-ఆరాంఘర్, మెహదీపట్నం-బెల్ మార్గాల్లో మెట్రో సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. ఆస్తి, ఇంటి పన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు చేస్తామని పేర్కొంది. అమరవీరుల కుటుంబానికి రూ.25 వేల పింఛను ఇస్తామని.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని వివరించింది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ సహా రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని తెలిపింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొంది. మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.