Harish Rao Comments on AP government: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న విషయం మాట్లాడితే కొందరు ఏపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన హరీశ్ రావు.. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. సిద్దిపేట బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. గతంలో ఆయన మాట్లాడిన మాటలపై వివరణ ఇచ్చారు.
గతంలో తాను పోలవరం పనులు ఎందుకు పూర్తి కావట్లేదని ప్రశ్నించానని.. అడిగిన దానికి సమాధానం చెప్పలేకే తనపై ఏపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజల పక్షానే తాను మాట్లాడానని వివరించిన హరీశ్ రావు.. ఏపీ గురించి తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
చేతనైతే విశాఖ ఉక్కు పోరాటం చేయాలి: తెలంగాణ అభివృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అన్నట్లు తెలిపారు. తెలంగాణలో అన్నీ బాగున్నాయి.. ఇక్కడే ఉండండి అన్నానని వివరించారు. ఏపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును కాళేశ్వరం మాదిరిగా పూర్తి చేయాలని అన్నారు.
"కొందరు ఏపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు. ఉన్నది అంటే కొందరు ఉలిక్కి పడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదు. పోలవరం పనులు ఎందుకు పూర్తి కావట్లేదని అన్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పలేకే విమర్శలు. ప్రజల పక్షానే నేను మాట్లాడాను. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అన్నాను. మేము ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. తెలంగాణలో అన్నీ బాగున్నాయి.. ఇక్కడే ఉండండి అన్నాను. ఏపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ఏపీ నేతలకు చేతనైతే విశాఖ ఉక్కు కోసం పోరాడాలి. పోలవరం కూడా కాళేశ్వరం మాదిరిగా పూర్తి చేయాలి"-మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి