Avinash Reddy Anticipatory Bail Petition కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. బాహ్య ప్రపంచానికన్నాా ముందే సీఎం జగన్‌కు వివేకా హత్య విషయంపై సమాచారం అందిందని, అవినాష్ రెడ్డే ఆ విషయం చెప్పారా! అనే అంశంపై దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. ఎంపీకి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏప్రిల్ 17 నుంచి అనేక మలుపులు తిరిగిన ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తేలిపోనుంది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏప్రిల్ 16న సీబీఐ అరెస్టు చేసి, ఆ తర్వాతి రోజున అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీంతో గత నెల 17న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఎదుట రోజూ విచారణకు హాజరు కావాలని.. దర్యాప్తులో ప్రశ్నలు, సమాధానాలు లిఖితపూర్వకంగా ఉండాలన్న న్యాయమూర్తి జస్టిస్ సురేందర్.. ఏప్రిల్ 25న విచారణ జరుపుతామని అప్పటి వరకూ అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని కొట్టేసింది.
ఇదీ చదవండి : Rolls Royce Cbi Case: రోల్స్ రాయిస్‌కు షాక్.. అవినీతి ఆరోపణలపై సీబీఐ కేసు
ఏప్రిల్ 27న మళ్లీ తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. 28న హైకోర్టుకు చివరి పనిదినం కావడంతో.. హడావిడిగా విచారణ జరపలేమన్న న్యాయమూర్తి.. వేసవి సెలవుల తర్వాత జూన్ 5కి వాయిదా వేశారు. అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమైందన్న సంకేతాలతో.. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా వేసవి సెలవుల ప్రత్యేక హైకోర్టును ఆదేశించాలని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరపాలని ఈనెల 23న తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.