తెలంగాణ

telangana

ETV Bharat / bharat

MP Avinash: అవినాష్​ అరెస్ట్​ తప్పదు.! దస్తగిరి వాంగ్మూలమే కాదు.. దర్యాప్తులో చాలా విషయాలు తేలాయి - avinash reddy arrest news

MP Avinash Reddy Bail Petition: వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని కచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని.. తెలంగాణ హైకోర్టుకు CBI తెలిపింది. అవినాష్ రెడ్డి సమక్షంలోనే సాక్ష్యాలను చెరిపేశారని నివేదించింది. సీబీఐ అరెస్టు చేసే ఉద్దేశంతో ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. లేదా పిటిషన్ తేలేవరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని.. అవినాష్ రెడ్డి కోరారు. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా తనను ఇరికించేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. వాదనల తర్వాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు సూచనతో అవినాష్ రెడ్డి విచారణ మంగళవారం సాయంత్రం 4 గంటలకు చేస్తామని సీబీఐ తెలిపింది. అదే సమయంలో ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్లపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

MP Avinash Reddy Bail Petition
MP Avinash Reddy Bail Petition

By

Published : Apr 18, 2023, 7:42 AM IST

MP Avinash Reddy Bail Petition: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి ఆదివారం సీబీఐ నోటీసు ఇచ్చింది. దీంతో సోమవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ముందస్తు బెయిల్ పై అత్యవసర విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్​ను అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. లంచ్ మోషన్​కు అంగీకరించిన సీజే.. పిటిషన్ పై విచారణను జస్టిస్ సురేందర్ కు అప్పగించారు. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లేదా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ తేలే వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. లేదా అరెస్టు చేస్తే బెయిల్​పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించాలని కోరారు.

ముందస్తు బెయిల్​ పిటిషన్లో పలు కీలక అంశాలు: వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీబీఐ ఇప్పటికి నాలుగు సార్లు విచారించి C.R.P.C. 161 కింద వాంగ్మూలం నమోదు చేసిందని.. అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తనపై అనుమానాలున్నాయని.. నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని గతంలో తెలంగాణ హైకోర్టులో వాదనల సందర్భంగా సీబీఐ పేర్కొందని ప్రస్తావించారు. కాబట్టి తనను నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశ్యంతో సీబీఐ ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కేవలం నిందితుడు దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ తనను ఇరికించాలని చూస్తోందని.. అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

సీబీఐ ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను తెరపైకి తెచ్చిందన్నారు. గూగుల్ టేకవుట్ దర్యాప్తులో ఆధారపడదగిన సాంకేతిక పరిజ్ఞానం కాదని.. దానివల్ల వ్యక్తి ఎక్కడున్నారో చెప్పలేమని అవినాష్ పేర్కొన్నారు. నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత సీబీఐ, సునీత తనను లక్ష్యంగా చేసుకున్నారని పిటిషన్‌లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులు సునీల్ యాదవ్ తల్లి, ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకాకు అక్రమ సంబంధం ఉందని.. అవినాష్ రెడ్డి పిటిషన్ లో ఆరోపించారు. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఉన్నాయని.. వాటన్నింటినీ దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.

ముందు ఉదయం.. ఆ తర్వాత సాయంత్రానికి వాయిదా: అవినాష్ రెడ్డి పిటిషన్ పై సోమవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు విచారణ చేపడతామని మధ్యాహ్నం రెండున్నరకు సీబీఐ తెలిపింది. మధ్యాహ్నం మూడు గంటలకే సీబీఐ విచారణకు పిలిచిందని అవినాష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి తెలిపారు. విచారణకు హాజరైతే అరెస్టు చేయబోమని సీబీఐ నుంచి హామీ ఇప్పించాలని తెలంగాణ హైకోర్టును కోరారు. విచారణకు హాజరైతే అరెస్టు చేయకుండా ఆగగలరా అని సీబీఐని న్యాయమూర్తి అడిగారు. అవినాష్ రెడ్డి విచారణకు సాయంత్రం 5 గంటల వరకు వేచి చూస్తామని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే హైకోర్టులో జరిగిన పరిణామాలతో.. మంగళవారం ఉదయం పదిన్నరకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి వాట్సప్ ద్వారా సీబీఐ అధికారులు నోటీసు పంపించారు.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు అవినాష్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు ప్రారంభించే ముందే.. అదుపులోకి తీసుకుంటారన్న అవినాష్ రెడ్డి ఆందోళనపై స్పందనమేటని సీబీఐని న్యాయమూర్తిని అడిగారు. అవినాష్ రెడ్డిని కచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని.. ముందస్తు బెయిల్ పిటిషన్​ను వ్యతిరేకిస్తున్నామని.. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. దీంతో ఇరువైపుల వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

సీఆర్​పీసీ 160కింద అవినాష్​ను అరెస్టు చేయవద్దు: అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి, సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదించారు. డబ్బుల కోసం హత్య చేసే దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని అవినాష్ తరఫు న్యాయవాది వాదించారు. దస్తగిరి క్షమాభిక్ష రద్దు చేయాలన్న భాస్కర్ రెడ్డి పిటిషన్ కోర్టులో పెండింగులో ఉండగానే.. ఆయనను అరెస్టు చేశారన్నారు. గతంలో నాలుగు సార్లు విచారణకు హాజరైనప్పుడు అరెస్టు చేయలేదు కదా.. ఇప్పుడు ఆందోళన ఎందుకని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదిని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. నిన్న భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని తెలిపారు. అవినాష్ ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాది కూడా చెబుతున్నారన్నారు. కాబట్టి CRPC 160 కింద అరెస్టు చేయవద్దని వాదించారు.

ఈనెల 30 వరకు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించినందున.. అవినాష్ రెడ్డిని అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని సీబీఐ వాదించింది. అవినాష్ విచారణతో పాటు.. చట్టపరంగా అవసరమైన తదుపరి చర్యలు కూడా తీసుకుంటామన్నారు. హత్య జరిగిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలోనే సాక్ష్యాలు చెరిపేశారని సీబీఐ వాదించింది. కుట్రలో అవినాష్ ప్రమేయం ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. కేవలం దస్తగిరి వాంగులంపైనే ఆధారపడటం లేదని.. అనేక శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు వివరించింది. CRPC 160 నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆధారాలను బట్టి అరెస్టులు చేయవచ్చునని సీబీఐ పేర్కొంది. కోర్టు సమయం ముగియడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు సూచన మేరకు అవినాష్ రెడ్డిని మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణ చేపడాతమని సీబీఐ తెలిపింది. సునీత కూడా తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details