తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"20 వరకు మార్గదర్శిపై కఠిన చర్యలు తీసుకోం".. తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ

MARGADARSI: ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఇక్కడ ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రామోజీరావు, సీహెచ్‌ శైలజలపై ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమంటూ ఏపీ ప్రభుత్వం సోమవారం తెలంగాణ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీని రికార్డు చేసిన హైకోర్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

TS HIGH COURT ON MARGADARSI
TS HIGH COURT ON MARGADARSI

By

Published : Mar 14, 2023, 9:53 AM IST

MARGADARSI: ఈ నెల 20వ తేదీ వరకు మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌పై కఠిన చర్యలు తీసుకోబోమని... తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంస్థ ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజపైనా చర్యలు తీసుకోబోమని తెలిపింది. ఏపీ ప్రభుత్వ హామీని రికార్డు చేసిన తెలంగాణ హైకోర్టు... కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీలో ఈ నెల 10న నమోదైన కేసుల దర్యాప్తు పేరుతో కఠిన చర్యలు తీసుకోకుండా, హైదరాబాద్‌లోని మార్గదర్శి కార్యాలయంలో సోదాలు, అరెస్టులు వంటివి చేయకుండా ఆదేశాలివ్వాలంటూ.. భోజన విరామ సమయంలో (లంచ్‌ మోషన్‌) విచారణ చేపట్టాలని మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. దాన్ని అనుమతించిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. అయితే విచారణ చేపట్టే ముందు కోర్టు పరిధిని పరిశీలించాల్సి ఉందని, అందువల్ల వారం రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తారా లేదంటే ఉత్తర్వులు జారీ చేయమంటారా అని ఏపీ న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకున్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది.. ఎలాంటి చర్యలూ తీసుకోబోమని హామీ ఇచ్చారు. దాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.వి.దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ గతంలో మార్గదర్శిలో సోదాలు నిర్వహించకుండా ఈ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా క్రిమినల్‌ కేసుల ద్వారా పరిధిని సృష్టించుకుంటున్నారన్నారు. ఈ కోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా ఆదేశించాలని కోరుతున్నామన్నారు. దురుద్దేశాలతో క్రిమినల్‌ కేసుల ద్వారా ఇందులో సంస్థ ఛైర్మన్‌ను, ఎండీలను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణలో ఉన్న కార్యాలయంలో జోక్యం చేసుకునే పరిధి ఏపీకి లేదన్నారు.

చిట్‌ఫండ్‌ చట్టప్రకారం లోపాలున్నట్లు గుర్తిస్తే నోటీసిచ్చి, వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఏపీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ కోర్టు పరిధి ఏమిటని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ తెలంగాణలో ఉన్న కార్పొరేట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అధికరణ 226(2) కింద ఈ కోర్టుకు పరిధి ఉందని తెలిపారు. గతంలో ఇక్కడ తనిఖీలకు ప్రయత్నించిందని.. దాన్ని సవాలు చేస్తూ తాము పిటిషన్‌ వేస్తే ఇప్పటిదాకా కౌంటరు దాఖలు చేయలేదని గుర్తుచేశారు.

60 ఏళ్లుగా ఆరోపణలు లేకుండా వ్యాపారం..

ఎలాంటి చిన్న ఆరోపణ లేకుండా 60 ఏళ్లుగా మార్గదర్శి వ్యాపారం చేస్తోందని న్యాయవాది తెలిపారు. రూ.1,699 కోట్లు నెట్‌ రిజర్వు ఫండ్‌ పెట్టామని, దీనికి పది రెట్లకు అంటే రూ.16,990 కోట్ల వరకు చిట్‌ గ్రూపులు నిర్వహించవచ్చని చెప్పారు. అయితే కంపెనీ రూ.587.86 కోట్లు వ్యాపారం మాత్రమే నిర్వహిస్తోందన్నారు. కంపెనీలో వచ్చిన లాభాలను, కమీషన్లను మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నామని, అంతేగానీ చందాదారుల సొమ్ము కాదని తెలిపారు. అలాంటప్పుడు అక్రమాలు జరిగాయని ఎలా చెబుతారన్నారు.

చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం వారికి ఎలాంటి కారణాలు దొరక్క.. క్రిమినల్‌ కేసులతో కార్పొరేట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఛైర్మన్‌, ఎండీలను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆరోపణలన్నీ హైదరాబాద్‌ కార్పొరేట్‌ కార్యాలయానికి చెందినవని, బ్రాంచ్‌లకు సంబంధం లేకపోయినా వారు పరిధి సృష్టించుకోవడానికి బ్రాంచ్‌లపై కేసు నమోదు చేశారన్నారు. అక్కడ బ్రాంచ్‌లపై కేసులు నమోదు చేయడం ద్వారా ఇక్కడ కార్పొరేట్‌ కార్యాలయం పరిధిలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

ఒక ప్రైవేటు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ నివేదిక ఆధారంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఫిర్యాదు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రైవేట్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌కు అలా తనిఖీ చేసే అధికారం లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏపీ హైకోర్టును ఎందుకు ఆశ్రయించరాదన్నారు. న్యాయవాది స్పందిస్తూ తెలంగాణ కార్పొరేట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందునే ఈ కోర్టును ఆశ్రయించామని చెప్పారు.

ఏపీ హైకోర్టుకు సోమవారం వరకు సెలవు ఉండటంతో శుక్రవారం కేసులు నమోదు చేసి, ఏపీలో బ్రాంచ్‌ మేనేజర్లను అరెస్ట్‌ చేశారన్నారు. అంతేగాకుండా కార్పొరేట్‌ వ్యవహారాలు, ఛైర్మన్‌, ఎండీలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. 4 రాష్ట్రాల్లోని శాఖల లెక్కలను కార్పొరేట్‌ కంపెనీ పర్యవేక్షిస్తుందన్నారు. చిట్‌ఫండ్‌ చట్ట ప్రకారం అన్నీ కాంపౌండబుల్‌, నాన్‌కాంపౌండబుల్‌, బెయిలబుల్‌ నేరాలేనని తెలిపారు. అందువల్ల ఐపీసీ వర్తించకపోయినా ఆ సెక్షన్లను వర్తింపజేసి కార్పొరేట్‌ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తున్నారన్నారు.

తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి లేదు.. ఏపీ న్యాయవాది

అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది గోవిందరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ ఇదే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించారు. తీవ్రమైన ఆరోపణలున్నాయని, ప్రాథమికంగా కేసు ఉందని, కావాలంటే కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో వారి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్నారు.

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏపీ, తెలంగాణ హైకోర్టులు నియంత్రిస్తూ రెండు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మీరు కేసు ఎలా నమోదు చేస్తారని ఏపీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై సందేహాలుంటే హైకోర్టు నుంచి స్పష్టత పొందవచ్చుగా అని అడిగితే.. ఆ ఉత్తర్వులను అమలు చేయలేదనిపిస్తే వారినే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసుకోమని చెప్పొచ్చని ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది హామీని రికార్డు చేస్తూ విచారణను వాయిదా వేశారు.

"20 వరకు మార్గదర్శిపై కఠిన చర్యలు తీసుకోం".. తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details