తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మార్గదర్శి' యాజమాన్యంపై అప్పటివరకు చర్యలు వద్దు: తెలంగాణ హైకోర్టు - Margadarsi Chit Fund Case latest updates

Telangana High Court on Margadarsi Chit Fund Case: మార్గదర్శి చిట్‌ఫండ్‌ యాజమాన్యంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తమ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ల అంశం తేలేదాకా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతోపాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూ ఆ సంస్థ ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజా చెరుకూరిలపై చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది. ఆరోపణలతో అధికారులు కేసులు నమోదు చేసినా.. చందాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు లేదని పేర్కొంది.

Margadarsi
మార్గదర్శి

By

Published : Mar 21, 2023, 9:44 PM IST

Telangana High Court on Margadarsi Chit Fund Case: ఏపీ పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీలు శైలజా చెరుకూరి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మార్గదర్శి వివాదానికి సంబంధించి ఇప్పటికే తమ వద్ద రెండు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్‌ కె.సురేందర్‌ పేర్కొన్నారు. భిన్నమైన ఉత్తర్వులు రాకుండా నివారించడానికి అన్నింటినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. వాటితో జత చేయడానికి వీలుగా మార్గదర్శి ఛైర్మన్, ఎండీలు దాఖలు చేసిన పిటిషన్‌లను ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

మార్గదర్శి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

మార్గదర్శికి వ్యతిరేకంగా నాలుగు నెలల క్రితం పత్రికా ప్రకటనలు వెలువడినా.. ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. అంతేగాకుండా చిట్‌ఫండ్‌ వ్యాపారానికి సంబంధించిన అన్ని పత్రాలు అందుబాటులో ఉన్నందున ఛైర్మన్, ఎండీలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌ ఆదేశించారు. గత ఏడాది నవంబరులో సోదాలు నిర్వహించిన నాలుగు నెలల తరువాత కేసులు నమోదు చేయడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు.

మార్గదర్శి నుంచి చిట్‌ మొత్తంగానీ, మరే ఇతర సొమ్ముగానీ చెల్లించలేదంటూ ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. చిట్‌ఫండ్‌ చట్టానికి విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మును మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి పంపి, మ్యూచువల్‌ ఫండ్, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో పెట్టుబడులు పెడుతున్నారన్నది ఏపీ ప్రభుత్వ ప్రధాన వాదన అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఆరోపణలన్నీ పెట్టుబడులు పెట్టారనేగానీ ఖాతాదారుల సొమ్మును ఖాతాల్లో చూపలేదనిగానీ, కనిపించకుండా చేశారన్నది కాదన్నారు. ఏపీ అధికారులు ఆరోపించిన విధంగా ఒకవేళ పెట్టుబడులు పెట్టిందనుకున్నప్పటికీ ప్రాథమికంగా అది నేరపూరిత దుర్వినియోగం లేదా చందాదారుని మోసగించడం కాదని తేల్చి చెప్పారు.


దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో 108 శాఖల ద్వారా లక్ష మంది చందాదారులు, 10 వేల కోట్ల రూపాయల టర్నోవరుతో 60 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నప్పటికీ, మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడం ఆసక్తికరమని జస్టిస్‌ కె.సురేందర్‌ తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనల ప్రకారం... ఏదైనా నేరం జరిగిందా లేదా అంటూ ఏపీ ప్రభుత్వ అధికారులు చీకట్లో వెతుకుతున్నారన్నారు.

స్టాంపుల శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పత్రికా ప్రకటనల ప్రకారం.. అధికారుల సాధారణ ఫిర్యాదులు తప్ప ఆర్థిక మోసం జరిగినట్లు స్పష్టమైన ఫిర్యాదు లేదన్నారు. నవంబరు 28న కమిషనర్‌ విలేకరుల సమావేశం నిర్వహించినప్పటికీ... కేసులు నమోదు చేసిన మార్చి 10వ తేదీ వరకు ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయలేదన్నది అంగీకరించాల్సిన విషయమని జస్టిస్‌ సురేందర్‌ పేర్కొన్నారు.

మార్గదర్శితోపాటు పిటిషనర్లు ఏపీ ప్రభుత్వ చర్యలపై తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే రెండు పిటిషన్‌లు దాఖలు చేశారని న్యాయమూర్తి జస్టిస్‌ సురేందర్‌ ప్రస్తావించారు. పిటిషనర్ల నివాసమూ, మార్గదర్శి ప్రధాన కార్యాలయమూ హైదరాబాద్‌లోనే ఉందన్నారు. బ్రాంచ్‌ల ద్వారా చందాదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి పంపి పెట్టుబడులు పెడుతున్నారన్నది పిటిషనర్లపై ప్రధాన ఆరోపణ. అందువల్ల అధికరణ 226(2) ప్రకారం ఈ కోర్టుకు పరిధి ఉందని న్యాయమూర్తి జస్జిస్‌ సురేందర్‌ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నవీన్‌చంద్ర ఎన్‌.మజీతియాస్‌ కేసులో పేర్కొన్న ప్రకారం మార్గదర్శి ఛైర్మన్, ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఉత్తర్వులు జారీ చేసే పరిధి ఈ కోర్టుకు ఉందని ఉత్తర్వులు ఇచ్చారు.

మార్గదర్శిపై నమోదైన ఫిర్యాదులన్నీ ఒకేలా ఉన్నట్టు కోర్టు గమనించిందని న్యాయమూర్తి జస్టిస్‌ సురేందర్‌ పేర్కొన్నారు. టి.టి.ఆంటోనీ వర్సెస్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే నేరానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట ఉల్లంఘనేనన్నారు. మార్గదర్శి కేసులోనూ ఆరోపణలన్నీ ఒకటే అయినప్పటికీ ఏపీలోని చాలా పోలీసు స్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నందున దర్యాప్తును ఏపీలో కాకుండా బయట ఇతర సంస్థలకు అప్పగించాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాది సిద్ధార్థలూత్రా వాదనకు బలం చేకూర్చేలా ఏపీ అధికారుల చర్యలు ఉన్నాయన్నారు.

ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయకపోవడం ముఖ్యమైన విషయమన్నారు. ఇదే కోర్టులో రెండు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున భిన్నమైన ఉత్తర్వులు వెలువడకుండా నివారించడానికి వాటితో కలిపి విచారించాల్సి ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అప్పటివరకు ఈ ఫిర్యాదులతోపాటు ఇలాంటివాటిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఏపీ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details