HIGH COURT ON MP AVINASH ANTICIPATORY BAIL PETITION: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు సీబీఐ విచారణకు ముందు తెలంగాణ కోర్టును అవినాష్ ఆశ్రయించడం ఉత్కంఠ రేపింది. సీబీఐ అధికారులు తనను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఏం జరుగుతోందో అనే అంశంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ, అవినాష్ సీబీఐ విచారణ రెండూ రేపటికి వాయిదా పడ్డాయి.
సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కడప ఎంపీ అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. దానిని రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ విచారణ చేపట్టారు. అంతకుముందు అవినాష్ పిటిషన్‌పై ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
ఎంపీ అవినాష్ తరఫున ఆయన సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి న్యాయవాది కోరారు. రేపు ఉ. 10.30కు విచారణకు రావాలని సీబీఐ నోటీసు ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం.. గతంలో అరెస్టు చేయలేదు కదా.. ఇప్పుడు ఆందోళన ఎందుకని ప్రశ్నించింది. అయితే దీనిపై సమాధానంగా.. నిన్న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారని న్యాయవాది తెలిపారు. అవినాష్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని సీబీఐ కూడా చెబుతోందని అవినాష్ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.