Telangana Govt Letter to KRMB Chairman : గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వినియోగించుకున్న జలాలను ఈ ఏడాదికి జమ చేయాలని.. తదుపరి త్రిసభ్య కమిటీ సమావేశంలో వాటిని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ రాష్ట్రం కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఏపీ ప్రతి ఏడాది కృష్ణా జలాలను వాటాకు మించి వాడుకుంటోందని.. 2022-23లో చెరి సగం నిష్పత్తిన చూస్తే 205 టీఎంసీలను.. 34:66 నిష్పత్తిలో 51 టీఎంసీలను ఎక్కువగా తీసుకొందని లేఖలో పేర్కొన్నారు. సమర్థంగా నీటిని వాడుకొని తదుపరి అవసరాల కోసం తెలంగాణ తన వాటాలోని నీటిని ఉమ్మడి జలాశయాల్లో నిల్వ చేసినట్లు తెలిపారు.
ENC Muralidhar letter to KRMB Chairman : ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు లేనందున గత ఏడాది 18.7 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ జలాశయంలో నిల్వ చేసుకున్నామని.. 2023-24 తొలి సీజన్లో తాగు, సాగు నీటి అవసరాలకు వాటిని వినియోగించుకోవాలన్నది తమ ప్రణాళిక అని వివరించారు. ఇదే విషయాన్ని గతంలోనే బోర్డుకు కూడా నివేదించినట్లు తెలిపారు. క్యారీ ఓవర్‌ను ప్రస్తుత ఏడాది రాష్ట్ర వాటాగా కూడా పరిగణలోకి తీసుకోరాదని ఈఎన్సీ కోరారు. ట్రైబ్యునల్ ముందు నివేదించిన ప్రకారం సాగర్ కింద ఏపీకి ఏడాది తాగు నీటి అవసరాలకు కేవలం 2.84 టీఎంసీలు మాత్రమే అవసరమని.. కానీ, 5 టీఎంసీలు ఇవ్వాలని కోరినట్లు లేఖలో గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో చెరిసగం వాటా కావాలన్న తమ డిమాండ్ నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖను నివేదించాలని 17వ బోర్డు సమావేశంలో నిర్ణయించారని.. నివేదనకు సంబంధించిన ప్రతిని తమకు ఇవ్వాలని తెలంగాణ కోరింది. 2023-24 సంవత్సరానికి నీటి కేటాయింపులను ఖరారు చేసే సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది.