Telangana government interested in bidding in Vizag Steel : విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు మూలధనం లేదా ముడి సరకుల కోసం నిధులు ఇచ్చి.. నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది. ఇందులో సింగరేణి తరపున లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటి పారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బృందం ఏర్పాటు..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉక్కును సమకూర్చుకోవడం మొదలగు లక్ష్యాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్నం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో అధికారుల బృందం విశాఖకు వెళ్లనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బిడ్డింగ్ ద్వారా ఎంత మొత్తంలో నిధులను సేకరిచాలనుకుంటున్నారు. వారు సరఫరా చేసే ఉత్పత్తులు లేదా నిధులను తిరిగి చెల్లించే విధానం, ఇతర షరతులు, నిబంధనలను కూలంకషంగా అధ్యయనం చేయనుంది.
విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన మూలధనం లేదా ముడిసరకుల కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ గత నెల 27న ప్రైవేట్, ఇతర స్టీల్ అనుబంధ రంగాల కంపెనీలు లేదా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. ఇది బీజేపీ అనుకూల కార్పొరేట్ కంపెనీలకు అప్పజెబుతూ అంతిమంగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే ప్రక్రియలో తొలి అడుగని, ఈవోఐ రూపంలో ప్రైవేట్ కంపెనీలను చొప్పించే కుట్రకు తెరలేపిందంటూ కేంద్రానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో భేటీ..బీఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలతో సమావేశం కాగా.. కేెంద్రం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు ఉన్న పరిష్కార మార్గాలను వారు సూచించారు. వాటిని కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి చంద్రశేఖర్ తీసుకెళ్లారు. దీనిపై ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. వారి నుంచి తగిన సమాచారం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వపరంగా ఈవోఐలో పాల్గొనాలని నిర్ణయించారు.
కేంద్రంపై ఒత్తిడికి నిర్ణయం..ఈ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న పక్షంలో కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై తమ పార్టీ వ్యతిరేకతను బలంగా చాటడమే కాకుండా, వాటి పరిరక్షణకు ప్రభుత్వపరంగా వ్యవహరించాల్సిన తీరుపై బలమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయీల హయాంలో కర్మాగారానికి మూలధన నిధులు అందించారని.. ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన ఉక్కును నేరుగా కొనుగోలు చేయవచ్చని, తద్వారా ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ఈవోఐ ప్రక్రియలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, నీటి పారుదల శాఖలను సైతం సన్నద్ధం చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బిడ్‌ల ఆహ్వానం..:విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్‌లను ఆహ్వానిస్తున్నట్లు యాజమాన్యం మార్చి 27న ప్రకటించింది. బొగ్గు, ఇనుప ఖనిజం, నేల బొగ్గు మొదలగు ముడి పదార్థాలను సరఫరా చేయడంతో పాటు నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదా ఉక్కు తయారీ ముడి పదార్థాల వ్యాపారం చేసేవిగా ఉండాలని పేర్కొంది. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది.
విశాఖ ఉక్కు బిడ్డింగ్‌పై తెలంగాణ ఆసక్తి ఇవీ చదవండి: