Political Leaders Wishes on Telangana Formation Day : దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. శుక్రవారం రాష్ట్రం పదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన విజయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వంటి ప్రముఖులు ట్విటర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
President Droupadi Murmu Wishes on TS Formation Day : 'రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రతిభావంతులైన వ్యక్తులను కలిగి ఉంది. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. ఆ రాష్ట్రం ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది. తెలంగాణ అభివృద్ధి, శ్రేయస్సు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
PM Modi Wishes on Telangana Decade Celebrations : 'తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను' అంటూ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు గొప్ప చరిత్ర, ప్రత్యేక సంస్కృతి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.
Governor Tamilisai on Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు.. గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. సంతోషకరమైన ఈ సందర్భం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల హృదయాలను ఆనందం, గర్వంతో నింపుతోందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అనేక మంది యువకులు చేసిన త్యాగాలను స్మరించుకునే... ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు. ఉద్యమంలో అమరులైన వారికి, వారి అంకితభావానికి... హృదయ పూర్వకంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.