Telangana Formation Day Decade Celebrations :రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ.. విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సలహాదారులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైన సీఎం.. వేడుకల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీ నుంచి 21 రోజుల పాటు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు వేడుకలు ఘనంగా నిర్వహించాలని భేటీలో నిర్ణయించారు.
ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాల ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ తెలిపారు. దేశంలోనే అతిపిన్న వయస్సు రాష్ట్రం అయినప్పటికి.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషితో నేడు అన్ని రంగాల్లో ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నేడు దేశానికే ఒక రోల్ మోడల్‌గా : తెలంగాణ నేడు దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారని చెప్పారు. అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి ఉంటుందని.. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని వివరించారు. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల.. నిర్దిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని కేసీఆర్ ఆక్షేపించారు.
సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచింది : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని ఉందనడానికి.. తొమ్మిదేళ్ల కాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని కేసీఆర్ వివరించారు. మొదటి సంవత్సరంతో పాటు, మరో కరోనా కాలపు రెండేళ్లు దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయినప్పటికి.. కేవలం ఆరేళ్ల కాలంలోనే రాష్ట్రం ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
మార్టియర్స్ డేగా జరుపుకోవాలి : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎం.. అమర వీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా మార్టియర్స్ డేగా జరుపుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, విద్యుత్తు దీపాలతో వెలిగించి గ్రామ గ్రామాన.. తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలని చెప్పారు. జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేయాలని.. అమరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసులు తుపాకీ పేల్చి అధికారికంగా గౌరవ వందనం చేస్తారని కేసీఆర్ వివరించారు.
మిగిలిన 20 రోజుల పాటు ప్రతి శాఖ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని.. కూలంకషంగా వివరించేలా డాక్యుమెంటరీలను ప్రదర్శించాలని కేసీఆర్ వివరించారు. ఆయా శాఖలు దేశానికే అదర్శంగా సాధించిన ప్రగతి, దాని వెనక రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టం, దార్శనికత, ధృక్పథం, తాత్వికంగా విశ్లేషిస్తూ డాక్యుమెంట్లను రూపొందించి.. సినిమా హాళ్లు, టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలని చెప్పారు. పవర్ డే, వాటర్ డే, వెల్ఫేర్ డే, అగ్రికల్చర్ డే, రూరల్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ డే.. రెవెన్యూ డే, రిఫార్మ్స్ డే, ఉమెన్ డే, ఇండస్ట్రీస్-ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టీజన్స్ డే, గ్రీన్ డే, హాండ్లూమ్ డేలను ఇలా ఒకొక్క శాఖలు ఒక్కో రోజు నిర్వహించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
ఉద్యమ చరిత్రను తెలిపేలా డాక్యుమెంటరీ : ఆర్థిక ప్రగతి, మౌలిక వసతుల అభివృద్ధి ఇలా ఒక్కో శాఖకు ఒక్కో రోజు కేటాయించి.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గురించి ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలుంటాయని కేసీఆర్ వివరించారు. స్వతంత్ర భారతంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం మొదలు.. రాష్ట్రాన్ని సాధించిన దాకా సాగిన ఉద్యమ చరిత్రను తెలిపేలా డాక్యుమెంటరీని రూపొందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంగా ఏర్పడి, ప్రభుత్వ పాలన ప్రారంభమైన 2014 జూన్ రెండో తేదీ నుంచి 2023 జూన్ రెండు వరకు.. స్వయం పాలనలో సాగిన సుపరిపాలన, సాధించిన ప్రగతి గురించి మరో డాక్యుమెంటరీని రూపొందించాలని చెప్పారు.
21 రోజుల పాటు తెలంగాణ సంబురాలు :21 రోజుల పాటు తెలంగాణ సంబురాలు నిర్వహించాలని కేసీఆర్ పేర్కొన్నారు. పిండి వంటలు, ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపదాలు, సంగీత విభావరి.. సినిమా - జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీతం, నృత్యం, తదితర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. గోల్కొండ కోటతో పాటు భువనగిరికోట లాంటి జిల్లాల్లోని చారిత్రక కట్టడాలు.. రామప్ప సహా రాష్ట్ర వ్యాప్తంగా వున్న దేవాలయాలను సుందరీకరించి విద్యుత్ కాంతులతో అలంకరించాలని వివరించారు .
హైదరాబాద్‌లో భారీ ఎత్తున కార్యక్రమాలు :హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలని కేసీఆర్ చెప్పారు. విధుల్లో మంచి ప్రతిభ కనబరిచిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డులు అందించాలని తెలిపారు. సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఐదారు వేల మంది కళాకారులతో.. హైదరాబాద్‌లో భారీ ఎత్తున కార్యక్రమాలు, ధూంధాం ర్యాలీ నిర్వహిస్తారని వివరించారు.
ఉత్సవ శోభ ప్రస్ఫుటించేలా.. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలోని ఉత్సవాల కమిటీ.. ఇందుకు సంబంధించి తరచూ సమావేశమవుతూ.. వీటిపై విధివిధానాలకు తుది రూపం ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఇవీ చదవండి :KTR Tweet On Karnataka Result : 'తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉండగా.. కర్ణాటక ఫలితాలు రిపీట్ కావు'
కాంగ్రెస్‌లో నయా జోష్.. ఇక ఆ రాష్ట్రాలపై దృష్టి.. నాయకుల మధ్య సయోధ్య కుదిరేనా?