Telangana Elections Betting: తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. కాంగ్రెస్‌కు ఓ ఛాన్స్ వస్తుందా.. బీజేపీ జెండా ఎగురుతుందా.. ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ నలుగురు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ. అయితే తెలంగాణలో ఎన్నికల ఫలితాలతో పాటు, ప్రముఖుల జయాపజయాలపై ఆంధ్రప్రదేశ్‌లో వందల కోట్ల రూపాయల మేర పందేలు (బెట్టింగులు) కాస్తున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన దళారులు వాట్సప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి వీటిని నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా తలపడుతుండటంతో ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులూ రంగంలోకి దిగారు.
తెలంగాణలో ప్రముఖులు బరిలో నిలిచిన నియోజకవర్గాలపై అధికశాతం పందేలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్రంలోని కరీంనగర్, హుజూరాబాద్, సూర్యాపేట, దుబ్బాక, గజ్వేల్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై 1:5 (100 రూపాయలకి 500) చొప్పున పందేలు కాస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బరిలో నిలిచినచోట వారికి వచ్చే మెజార్టీలపై 1:10 (100 రూపాయలకి వెయ్యి) అంటూ దళారులు ఊరిస్తున్నారు.
గెలిస్తే 5 కోట్ల రూపాయలు: ఏపీలోని.. పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన క్రికెట్, కోడి పందేల నిర్వాహకులు తెలంగాణ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఐపీఎల్, ప్రపంచకప్ క్రికెట్లో బెట్టింగ్‌లు వేసి నష్టపోయిన వారిని ఏజెంట్లుగా మార్చుకొని దందా ప్రారంభించారు. భీమవరం ప్రాంతానికి చెందిన ఓ రొయ్యల చెరువు వ్యాపారి శేరిలింగంపల్లిలో విజయం సాధించబోయే పార్టీపై కోటి రూపాయల పందెం కాసినట్లు విశ్వసనీయ సమాచారం. గెలిస్తే 5 కోట్ల రూపాయల లాభం, ఓడితే కోటి రూపాయల నష్టం అంటూ ఖాళీ బ్యాంకు చెక్కులను దళారుల చేతికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్‌లో మూడు ప్రధాన పార్టీల గెలుపోటములు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చే మెజార్టీలపై కూడా స్థానికంగా భారీగా పందేలు కాస్తున్నారు.