Telangana Election Same Name Candidates : శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులు కూడా ఉన్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు(MLA Candidates List 2023) దాదాపుగా సరిపోలుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో దాదాపుగా ఒకే పేరు ఉన్న అభ్యర్థులు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో నిలిచారు. ఓటర్లను తికమక పెట్టేందుకు ప్రత్యర్థులు సహజంగా ఈ ఎత్తుగడను వినియోగిస్తుంటారు. తాజా ఎన్నికల్లోనూ కొన్ని చోట్ల ఈ తరహా వ్యూహాన్ని అవలంభించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లను పోలిన వారితో రిజిస్టర్డ్ పార్టీ లేదా స్వతంత్రులుగా నామినేషన్ వేయించారు. అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈ తరహా పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొందరు అదే నియోజకవర్గాలకు వారు ఈ తరహా నామినేషన్లు దాఖలు చేయగా.. మరికొందరు మాత్రం తమ సొంత జిల్లాలను కాదని వెళ్లి మరీ మరోచోట నామినేషన్లు దాఖలు చేశారు. సిర్పూర్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా.. డోంగ్రి ప్రవీణ్ కుమార్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో దిగారు. నిర్మల్‌లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండగా.. మంతెన ఇంద్రకరణ్ రెడ్డి అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి కాంగ్రెస్ అభ్యర్థి కాగా.. సుదర్శన్ రాజ్ ఆకులపల్లి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలో దిగగా.. చంద్రశేఖర్ చలిక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన నివాసం కూకట్ పల్లి, మేడ్చెల్ జిల్లా. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తుండగా.. గుర్రం కమలాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
Telangana Elections 2023 : పురుమాల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి, నల్లాల శ్రీనివాస్ బీఎస్పీ నుంచి పోటీలో ఉండగా.. బండి శ్రీనివాస్ ఇండియా జనశక్తి పార్టీ, పెంచల శ్రీనివాస్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. సిరిసిల్లలో రెడ్డిమల్ల శ్రీనివాస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా, లగిశెట్టి శ్రీనివాస్ విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి, తాటిపాముల శ్రీనివాస్ - స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మెదక్‌లో పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్(BRS) నుంచి బరిలో ఉండగా.. లంసగల్ల పద్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎన్నికల వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్
మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా.. వనపర్తి రోహిత్ భారత చైతన్య యువజన పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఆందోల్‌లో చంటి క్రాంతి కిరణ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండగా.. ఎన్. క్రాంతి కుమార్, పి. క్రాంతి కుమార్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉండగా.. చేకూర్తి లక్ష్మారెడ్డి, పిల్లుట్ల లక్ష్మి, బిడిమట్ట లక్ష్మి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జహీరాబాద్‌లో ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి కాగా.. బి. చంద్రకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.
సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్.. సబితా మద్ది స్వతంత్ర పార్టీ : మల్కాజ్ గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా.. రాజశేఖర్ రెడ్డి వీరయ్యగారి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఉప్పల్‌లో బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కాగా.. లక్ష్మారెడ్డి మన్నె అలయన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనది యాదాద్రి జిల్లా పెద్దగూడెం. ఎల్బీనగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండగా అదే పేరు కలిగిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సుధీర్ రెడ్డి దేప అనే అభ్యర్థి కూడా స్వతంత్రంగా బరిలో ఉన్నారు. మహేశ్వరంలో పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండగా.. సబితా మద్ది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అందె శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి పోటీలో ఉంటే.. టి.శ్రీరాములు యాదవ్ భారతీయ క్రాంతిసంఘ్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా.. కె.కిషన్ రెడ్డి అలయెన్స్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాజేంద్ర నగర్లో తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటే.. కొలుకూరి శ్రీనివాస్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.