తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖ్యమంత్రిగా రేవంత్‌వైపే రాహుల్‌ మొగ్గు - సాయంత్రం సీఎల్పీ భేటీలో ప్రకటించనున్న డీకే - తెలంగాణ ముఖ్యమంత్రి 2023

Telangana CM Selection 2023 : రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, మంత్రివర్గం సహా పీసీసీ, సీఎల్పీ నేతల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేసిన ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను అధిష్ఠానానికి నివేదించారు. ఇప్పటికే డీకే శివకుమార్, మాణిక్‌రావ్‌ ఠాక్రే దిల్లీలోనే మకాం వేయగా, ఉత్తమ్‌, భట్టి సైతం హస్తిన చేరుకున్నారు. తాజాగా ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, వేణుగోపాల్, డీకే సమావేశమయ్యారు. తెలంగాణ పరిణామాలపై చర్చించిన అనంతరం రాహుల్‌ రేవంత్‌ వైపే మొగ్గు చూపారు. అనంతరం ఖర్గే నివాసం నుంచి రాహుల్‌ వెళ్లిపోయారు. ఈ భేటీ ముగియడంతో సీఎం అభ్యర్థిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Congress High Command Announces Telangana Chief Minister 2023
Telangana CM Selection 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 2:17 PM IST

Updated : Dec 5, 2023, 2:46 PM IST

Telangana CM Selection 2023 :రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 64 మందిని హైదరాబాద్‌ రప్పించి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉంచిన పార్టీ నాయకత్వం నిన్న అభిప్రాయాలు సేకరించింది. ఏకవాక్య తీర్మానంతో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికే అప్పగించారు. పార్టీ రాష్ట్ర నాయకులతో సోమవారం సమావేశమైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్ష పదవి, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ శాఖలు తదితర పదవులపై చర్చలు సైతం జరిపినట్లు సమాచారం.

Congress High Command Announces Telangana Chief Minister 2023 : ఉప ముఖ్యమంత్రితో పాటు పీసీసీ పదవి తనకే ఇవ్వాలని ఓ సీనియర్‌ నాయకుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరో సీనియర్‌ నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని పట్టుబట్టగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం లేదని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ విషయం ఏఐసీసీ దృష్టికి వెళ్లడంతో సీఎల్పీ నేత ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఏఐసీసీ ఆదేశించినట్లు సమాచారం.

సోమవారం జరిగిన సీఎల్పీ భేటీలో 3 తీర్మాణాలు చేసినట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది. సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మాణం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల సేకరణలో దాదాపు 55 మంది సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి వైపే మెుగ్గు చూపినట్లుగా సమాచారం. ఆ తీర్మానాన్ని దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏఐసీసీ పరిశీలకులు పంపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండాలని ఏఐసీసీ పరిశీలకులు సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ఎవరిని నియమిస్తారనేది సాయంత్రం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు వివరించేందుకు డీకే శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రే దిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో రాష్ట్ర నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క సైతం ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. తాజాగా ఖర్గే నివాసంలో భేటీ అయిన డీకే శివకుమార్, రాహుల్‌ గాంధీ, వేణుగోపాల్‌ తెలంగాణ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎంగా రేవంత్‌ పేరును ఖరారు చేయాలని రాహుల్‌ సూచించారు. ఈ భేటీ ముగియడంతో డీకే శివకుమార్‌ సాయంత్రం హైదరాబాద్‌ రానున్నారు. సీఎల్పీ భేటీలో సీఎం పేరును ప్రకటించనున్నారు.

మరోవైపు ఎల్లా హోటల్‌లో ఉన్న రేవంత్‌రెడ్డిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్‌లో రేవంత్ ఉండే గది వద్ద పోలీసులు భద్రత పెంచారు. రేవంత్‌ ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Last Updated : Dec 5, 2023, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details