Telangana CM Revanth Reddy Profile : మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ధీరత్వం, గుక్క తిప్పుకోని ప్రసంగాలతో మంత్రముగ్ధుల్ని చేసే చాతుర్యం, ఆవేశపూరిత వాగ్బాణాలతో యువతను ఉర్రూతలూగించగలిగే నాయకత్వం, ఆటుపోట్లకు వెన్ను చూపకుండా ఎదురొడ్డి నిలిచిన వీరత్వం, పార్టీలో చేరి పదేళ్లు కాకున్నా కాకలు తీరిన నేతలతో సాధ్యపడని లక్ష్యాన్ని ముద్దాడి శతాధిక పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత. అలుపెరగని పోరాటంతో అనధి కాలంలోనే అగ్రనేతగా ఎదిగి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు అనుముల రేవంత్ రెడ్డి.
Telangana New CM Revanth Reddy Political Journey : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న అనుముల నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు. వనపర్తిలో పాలిటెక్నిక్ చేసిన ఆయన కాలేజీలో చదువుకునే సమయంలో విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉండేవారు. 2002లో టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్)లో చేరి కొంతకాలమే ఆ పార్టీలో కొనసాగారు. తదనంతర కాలంలో జడ్పీటీసీగా పోటీ చేసి 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా గెలుపొందిన రేవంత్ ఆరంభంలోనే సత్తా చాటారు.
అతడే ఒక సైన్యం - గెలుపు తీరాలకు కాంగ్రెస్ పార్టీని చేర్చిన ధీవర
TPCC Chief Revanth Reddy Political Biography: 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి, రాజకీయ పార్టీల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు. 2008లో టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత గురునాథ్ రెడ్డిపై 6 వేల 989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో 14 వేల 614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలోనే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా ఉండి అసెంబ్లీలో అప్పటి అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడారు.