Telangana CLP Meeting in Hyderabad : రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆదివారం రాత్రి గవర్నర్ను కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. భేటీ ముగియడంతో అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్కు తెలియజేయనున్నారు.
Congress Government Formation in Telangana :ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపికపై చర్చించినట్లు కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎంపిక బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి తీర్మానం పెట్టగా ఎమ్మెల్యేలు దాన్ని బలర్చారని వెల్లడించారు. అనంతరం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు అధిష్ఠానానికే అప్పగించారని చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపినట్లు పరిశీలకుడు డీకే శివకుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశీలకులు డీకే శివకుమార్, జార్జ్, దీపాదాస్ మున్షీ, అజయ్, మురళీధరన్, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Telangana New Government Formation Updates 2023 : అయితే పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది. పార్టీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే సీఎల్పీ భేటీ తర్వాతే అధికారికంగా సీఎం అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉందనేది చర్చ జరుగుతోంది. అయితే భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.