ToDay Telangana Cabinet meeting decisions : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతను సుమారు 5గంటల పాటు జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా వరద బాధితుల తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వరదలకు మృతి చెందిన 40 మందికి పరిహారం అందించాలని నిర్ణయించారు. పొలాల్లో ఇసుక మేటలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
వరదలకు తెగిన రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయాలని కేబినేట్ భేటీలో నిర్ణయించారు. వరద సమయంలో ప్రభుత్వం చేసిన సహాయక చర్యలు గురించి వివరించారు. సుమారు 27 వేల మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి తెలిపారు. ఇద్దరు ఉద్యోగులు విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించారని కొనియాడారు. ఆగస్టు 15న ఇద్దరు సిబ్బందికి ప్రభుత్వ సత్కారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌కు సన్మానం చేస్తామని ప్రకటించారు.
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం: అలాగే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై సుమారు 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగులుగా గుర్తింపుపై విధివిధానాల కోసం సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సబ్ కమిటీ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెడతామని పేర్కొన్నారు.
మెట్రో విస్తరణకు రూ.60వేల కోట్లు:అలాగేహైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు, నాలుగేళ్లలో మెట్రో రైలును భారీగా విస్తరించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాయదుర్గం-విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో, ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో, ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు.
2024 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది: ఉప్పల్ నుంచి బీబీ నగర్, భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఉప్పల్ నుంచి ఈసీఐఎల్, పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా పూర్తిచేస్తామని ప్రకటించారు. విమానాశ్రయం నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరణ చేస్తామని తెలిపారు. మెట్రో రైలు విస్తర్ణకు రూ.60 వేలు కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. దీనికి కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని.. బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ధీమ వ్యక్తం చేశారు.
శాసన మండలికి ఇద్దరు సభ్యుల ఎన్నిక: గవర్నర్ కోటాలో శాసన మండలికి ఇద్దరు సభ్యుల ఎంపిక చేసినట్లు కేటీఆర్ ప్రకటించారు. మండలి అభ్యర్థులుగా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్‌లో ఉద్యాన కళాశాల ఏర్పాటు, హైదరాబాద్‌లో హైబ్రిడ్ విధానంలో 4 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు, నిమ్స్‌లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకలు ఏర్పాటుకు కేబినేట్ నిర్ణయం తీసుకుంది. బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
అలాగే మామునూరు విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర గవర్నర్ వెనక్కి పంపిన 3 బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదిస్తామని.. రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆర్ఫన్ పాలసీ తీసుకొస్తున్నట్లు కేటీఆర్ వివరించారు.
ఇవీ చదవండి: