Telangana Assembly Elections Schedule 2023 Released :
Telangana Assembly Elections Schedule 2023 Released : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా.. అందులో 88 జనరల్, 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1.58 కోట్లు, మహిళలు 1.58 కోట్లు, వందేళ్లు దాటిన వారు 7,689 మంది, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది, దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షల మంది ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. వెబ్ క్యాస్టింగ్ కేంద్రాలు 27,798, బ్యాలెట్ యూనిట్లు 72 వేలు, 57 వేల కంట్రోల్ యూనిట్లు, 56 వేల వీవీ ప్యాట్ యంత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 148 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభ పరిణామమని సీఈసీ రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్లలో 22 లక్షలకు పైగా ఓట్లను తొలిగించినట్లు తెలిపారు. వీటిని ఏకపక్షంగా తొలగించలేదని.. ఫామ్ అందిన తర్వాతే తొలిగించినట్లు చెప్పారు.
ఇదే సమయంలో యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయమని రాజీవ్‌కుమార్ అన్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ మహిళా ఓటర్ల సంఖ్య 3.45 లక్షలుగా ఉందని.. రాష్ట్రవ్యాప్తంగా 66 నియోజక వర్గాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిపేందుకు చిత్త శుద్ధితో ఉన్నామన్నారు. మద్యం, డబ్బు పంపిణీ, కానుకల ప్రభావంపై స్పెషల్ రాడార్ ఉంటుందని రాజీవ్‌కుమార్ స్పష్టం చేశారు.