Telangana Assembly Elections Results 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల నాడిని అంచనా వేస్తున్న పలు సర్వేలు కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు వస్తాయని వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా ఇండియా టుడే సైతం తన సర్వేను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 63 నుంచి 73 సీట్లు వస్తాయని తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ 34 నుంచి 44 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీజేపీ 4 నుంచి 8 స్థానాల్లో, ఇతరులు 5 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే తన సర్వేలో ప్రకటించింది. అన్ని పార్టీలకు వచ్చిన ఓటు షేరింగ్ శాతం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 42 శాతం, బీఆర్ఎస్కు 36 శాతం, బీజేపీకి 14 శాతం, ఏఐఎంఐఎం పార్టీకి 3 శాతం, ఇతరులకు 5 శాతం వచ్చింది.
India Today Exit Polls 2023 : 2018 ఎన్నికల సమయంలోనూ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకు నిజమయ్యాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 79-91 సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఆ సంస్థ అంచనాలను నిజం చేస్తూ 88 సీట్లతో విజయబావుటా ఎగురవేసింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ సైతం నిన్న తన ప్రెస్మీట్లో ప్రస్తావించారు. ఈ లెక్కన ఈసారి హస్తం పార్టీ 63 - 73 సీట్లు గెలుస్తుందని ఇండియా టుడే వెల్లడించింది. మరి ఈసారి ఆ సంస్థ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం నుంచి వెలువడిన అన్ని సర్వేలూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. మరి ఓటర్ల నాడి ఎలా ఉందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.
సీఎన్ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్ 2023 : సీఎన్ఎన్ ఐబీఎన్ ప్రకటించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 35 నుంచి 40 స్థానాల వరకు గెలవచ్చని తెలిపింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 65 నుంచి 70 స్థానాల వరకు రావచ్చని వెల్లడించింది. అదే క్రమంలో బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లోనూ, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు సీఎన్ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.